Pacific Ocean | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న భూతాపాన్ని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ఓ బృహత్తర ప్రయోగానికి సమాయత్తమయ్యారు. పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై ఐరన్ సల్ఫేట్‌ను పరిచి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించేందుకు ఓషన్ ఐరన్ ఫర్టిలైజేషన్ (ఓఐఎఫ్) అనే ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పసిఫిక్ మహా సముద్రానికి ఆగ్నేయ ప్రాంతంలో 3,800 చదరపు మైళ్ల పరిధిలో ఐరన్ సల్ఫేట్ పౌడర్‌ను పడవల ద్వారా వెదజల్లనున్నారు. ఐరన్ సల్ఫేట్కు సీవో2ను పీల్చుకొనే స్వభావం ఉండటంతో తమ ప్రయోగం ద్వారా భూతాపాన్ని 2.7 డిగ్రీల ఫారన్‌హీట్ మేర తగ్గించవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2026నాటికి ఈ ప్రయోగం తొలిదఫా పూర్తిచేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
40 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఏటా వాతావరణంలోకి విడుదల అవుతున్నది. దీంట్లో 30 శాతాన్ని సముద్రాలే పీల్చుకొంటున్నాయి. దీంతో భూతాపాన్ని తగ్గించడానికి సముద్ర జలాల్లోని సీవో2 స్థాయిలను తగ్గించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సముద్రం నీటిలో సీవో2ను వేగంగా పీల్చుకొనే పైటోప్లాంక్టన్ అనే ఒకరకమైన నాచును ఐరన్ సల్ఫేట్ సాయంతో పెంచడానికి సిద్ధమయ్యారు.
తాజా ప్రయోగంతో సముద్ర జీవాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జలాల్లో ఐరన్ సల్ఫేట్ మోతాదు పెరుగడంతో సముద్ర జీవుల ఆహారగొలుసుపై ప్రభావం పడొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.