ముంబై: సీనియర్ ఐపీఎస్ అధికారి దేవన్ భారతి ఇవాళ ముంబై స్పెషల్ పోలీసు కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కొత్త పోస్టు కోసం మహారాష్ట్ర హోంశాఖ బుధవారం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై పోలీసు కమీషనర్‌గా వివేక్ పన్సల్కర్ కొనసాగుతున్నారు. కొత్త పోస్టును క్రియేట్ చేసి.. దేవన్ భారతిని ఆ పోస్టులో అపాయింట్ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కొత్త పోస్టుతో సమాంతర పరిపాలన సాగిస్తున్నట్లు కాంగ్రెస్, ఎన్సీపీలు ఆరోపించాయి.
దక్షిణ ముంబైలో ఉన్న సిటీ పోలీసు ప్రధాన కార్యాలయానికి భారతి ఇవాళ ఉదయం చేరుకున్నారు. దేవన్ 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. బీజేపీ నేత ఫడ్నవీస్ ఆయన సన్నిహితుడని తెలుస్తోంది. ఫడ్నవీస్ సీఎంగా ఉన్న సమయంలో లా అండ్ ఆర్డర్ కమీషనర్‌గా చేశారాయన. ఆ తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు అదనపు డీజీపీగా ప్రమోషన్ పొందారు. 2019లో మహా వికాశ్ అగధి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవన్ భారతిని ఆ పోస్టు నుంచి తొలగించారు.