చండీగఢ్: హర్యానాలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ముదరకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. ఆగస్టు 2వ తేదీ వరకు ఇంటర్నెట్ సేవలపై ఈ నిషేధం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇవాళ ఉదయం నూహ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ర్యాలీ ఘర్షణలకు కారణమైంది. వీహెచ్‌పీ ర్యాలీపై మరో వర్గం వాళ్లు రాళ్లు విసరారు. దాంతో వీహెచ్‌పీ కార్యకర్తలు కూడా వారిపై రాళ్ల దాడి చేశారు. ఇరువర్గాలు పోటీపడి కనిపించిన వాహనానికల్లా నిప్పుపెట్టారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సోషల్ మీడియా అసత్య ప్రచారం, పుకార్లు వెల్లువెత్తకుండా నూహ్ పట్టణ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. ఆగస్టు 2 వరకు నిషేధం అమల్లో ఉంటుందని, అప్పటి పరిస్థితిని బట్టి ఇంటర్నెట్పై బ్యాన్‌ను మరింత పొడిగించే అవకాశం కూడా ఉన్నదని అధికారులు వెల్లడించారు.