విశాఖపట్నం: భారత నావికా దళంలోకి సోమవారం జలాంతర్గాముల విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ఆండ్రోత్ ప్రవేశించింది. నావికా దళంలో ఇది రెండో యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. తూర్పు నావికా దళం కమాండ్ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధర్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగింది. ఆండ్రోత్ను కోల్‌కతాలోని భారతీయ షిప్‌యార్డ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) నిర్మించింది. దీని నిర్మాణంలో 80 శాతానికిపైగా స్వదేశీ విడి భాగాలనే ఉపయోగించారు. దీని రాకతో జలాంతర్గాముల దాడులను నిరోధించడంలో భారత నావికా దళం సామర్థ్యం మరింత పెరిగింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయి. లక్షద్వీప్‌లోని ప్రముఖ దీవి పేరు ఆండ్రోత్. ఇది పెద్ద దీవి మాత్రమే కాకుండా, సౌందర్యం, సాంస్కృతిక ప్రాధాన్యం గలది. ఇక్కడ కొబ్బరి తోటలు, ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన బీచ్‌లు ఉంటాయి.