న్యూఢిల్లీ: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన విషయం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐఎన్ఎల్డీ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి సురేందర్ లాథర్(Surender Lathar) ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తానన్న దానిపై అతను కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే ఓ నోటరీపై ఆ వాగ్దానాలను రాశారు. దానిపై ఆయన సంతకం చేశారు. ప్రస్తుతం ఆ నోటరీ వైరల్ అవుతున్నది.
బుదా ఖేరా లాథర్ గ్రామానికి చెందిన సురేందర్.. తన నోటరీలో 25 వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు చెప్పారు. జులానా అసెంబ్లీ సెగ్మెంట్లో ఆ ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి ఊరుకు కిసాన్ మజ్దూర్ భవన్ కట్టించనున్నట్లు చెప్పారు. ఒకవేళ వాగ్ధానాలను అమలు చేయకుంటే, అప్పుడు తాను రిజైన్ చేయనున్నట్లు ఆ నోటరీలో రాశారు.