న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వ్యాపారవేత్త సందీప విర్క్‌ను అరెస్టు చేశారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మంది ఫాలోవర్లు(Instagram Influencer) ఉన్నారు. నటిగా చెప్పుకుంటున్న ఆమె.. సుమారు 40 కోట్ల మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఐపీసీలోని 406, 420 సెక్షన్ల కింద మోహాలీ పోలీసు స్టేషన్లో సందీపాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, ముంబై నగరాల్లోనూ సోదాలు జరిగాయి. మనీల్యాండరింగ్ చట్టం కింద ఆ తనిఖీలు చేపట్టారు. అక్రమ రీతిలో సందీపా విర్క్ స్థిరాస్తులను సేకరించినట్లు ఈడీ ఆరోపించింది. హైబూకేర్ డాట్‌కామ్(hyboocare.com) వెబ్‌సైట్‌కు ఓనర్ అని ఆమె చెప్పుకుంటోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన బ్యూటీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నది. అయితే అలాంటి ఉత్పత్తులు ఏమీ లేవని దర్యాప్తుదారులు గుర్తించారు. వెబ్‌సైట్‌కు యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవు. పేమెంట్ గేట్‌వే విఫలం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా సైట్‌కు ఆనవాళ్లు లేవు. ఆ సైట్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా యాక్టివ్‌గా లేదు. ప్రస్తుతం మనుగడలో లేని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థ మాజీ డైరెక్టర్ అంగరాయ్ నటరాజన్ సేతురామన్‌తో ఆమెకు లింకులు ఉన్నట్లు గుర్తించారు.