Indrani Mukerjea: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జిపై తీసిన డాక్యుమెంటరీ సిరీస్ను నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాకుండా నిలిపివేయాలని అభ్యర్థిస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. డాక్యుమెంటరీ ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించే అధికారం తమకు లేదని కోర్టు స్పష్టం చేసింది. కావాలంటే ఈ విషయంలో ఏదైనా సంబంధిత ఫోరమ్ను ఆశ్రయించవచ్చని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్పీ నాయక్-నింబాల్కర్ సలహా ఇచ్చారు.
‘ద ఇంద్రాణి ముఖర్జియా స్టోరీ: సమాధి చేయబడ్డ వాస్తవం’ పేరుతో 25 ఏళ్ల షీనా బోరా హత్యపై ఓ డాక్యుమెంటరీ సిరీస్ రూపుదిద్దుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో షీనా బోరా కేసులో నిందితులుగా ఉన్న వాళ్లు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్లు నటించారని, కాబట్టి ఆ డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ స్పెషల్ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది.
దాంతో ఆ డాక్యుమెంటరీ సిరీస్ ప్రసారాలను అడ్డుకునే అధికారం తమకు లేదంటూ స్పెషల్ కోర్టు సీబీఐ పిటిషన్ను తోసిపుచ్చింది. కాగా, 2012లో ఇంద్రాణి ముఖర్జియా తన డ్రైవర్ శ్యామ్వర్, మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి.. తన మరో మాజీ భర్తతో కన్న 25 ఏళ్ల కూతురు షీనా బోరాను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వేరే కేసులో అరెస్టయిన డ్రైవర్ శ్యామ్వర్ ద్వారా 2015లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
దాంతో 2015లో ప్రధాని నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాతోపాటు డ్రైవర్ శ్యామ్వర్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు 2022లో బెయిల్ లభించింది. కేసులో ఇతర నిందితులు కూడా ప్రస్తుతం బెయిల్పై బయటే ఉన్నారు.