Dancing Cop : ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ అంటే సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్లకు తెలిసే ఉండొచ్చు. మైకేల్ జాక్సన్లాగా స్టెప్పులేస్తూ, డ్యూటీని ఎంజాయ్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తుంటాడు. అతడి డ్యాన్స్ మూవ్స్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అతడి గురించి ఎందుకూ అంటే.. డ్యూటీలో వినూత్న పద్ధతితో పేరు తెచ్చుకున్న రంజీత్ సింగ్.. ఇప్పుడు అదే వృత్తిపరంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు.
హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న అతడిని తిరిగి కానిస్టేబుల్‌గా డిమోషన్ ఇచ్చారు పోలీస్ ఉన్నతాధికారులు. ఒక మహిళ అతడిపై ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం. మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని హైకోర్టు స్క్వేర్ వద్ద రంజీత్ సింగ్ ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తుంటాడు. అయితే, అతడు అందరిలా కాకుండా.. మైకేల్ జాక్సన్లాగా డ్యాన్స్ చేస్తూ, చేతితో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తుంటాడు. అందుకే అతడ్ని అందరూ ‘డ్యాన్సింగ్ కాప్’ అని పిలుస్తుంటారు. అతడికి సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అతడి ప్రత్యక తీరుకు గుర్తింపు దక్కింది. ట్రాఫిక్ డ్యూటీని ఎంజాయ్ చేస్తూ, కంట్రోలో చేస్తున్న అతడిపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. దీంతో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అతడిని సర్వీస్ రూల్స్‌కు భిన్నంగా త్వరగా హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ ఇచ్చారు. వృత్తిపరంగా ఇలా ప్రశంసలతో దూసుకెళ్తున్న రంజీత్ సింగ్.. వ్యక్తిగతంగా మాత్రం వివాదంలో చిక్కుకున్నాడు.
ముంబైకు చెందిన ఒక మహిళ అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను ఆన్లైన్లో వేధిస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అసభ్య, అనుచిత మెసేజ్‌లు పంపిస్తున్నాడని, ఇండోర్‌లో కలవడానికి రావాలని కోరుతున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రంజీత్ సింగ్‌పై చర్యలకు దిగారు. అతడిని ఫీల్డ్ డ్యూటీ నుంచి తప్పించారు. అంతేకాదు.. అతడికి ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్‌ను నిలిపివేశారు. మళ్లీ కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, తుది విచారణ అనంతరం, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.