భోపాల్: ఒక లా స్టూడెంట్ చాట్‌జీపీటీ, ఏఐ ద్వారా నకిలీ నీట్ ప్రశ్నాపత్రాలు తయారు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం ద్వారా రూ.50, రూ.100కు వాటిని అమ్మాడు. పసిగట్టిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Fake NEET Papers) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. లసూడియా ప్రాంతానికి చెందిన అక్షయ్ మాల్వీయా, ఇండోర్‌లోని ఒక లా కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పాత ప్రశ్నాపత్రాలు, స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించి చాట్‌జీటీపీ, ఏఐ ద్వారా నకిలీ నీట్ పేపర్స్‌ను తయారు చేశాడు. ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. నీట్ పేపర్ లీకైనట్లు అందులో ప్రచారం చేశాడు. రూ.50 నుంచి వంద వరకు వాటిని విక్రయించాడు.
కాగా, నీట్ పేపర్ల యాక్సెస్ కోసం ఆన్లైన్లో చెల్లింపులు చేయాల్సిన ఒక లింక్‌ను తన ప్రొఫైల్‌లో అక్షయ్ ఉంచాడు. సుమారు 20 మందికిపైగా విద్యార్థులు యూపీఐ, ఇతర ఆన్లైన్ పద్ధతుల ద్వారా చెల్లింపులు చేసి వాటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లోని కోటా పోలీసుల నిఘా సమాచారంతో ఇండోర్ పోలీసులు స్పందించారు. శనివారం రాత్రి అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు నీట్ పరీక్ష రద్దు వివాదం సమయంలో కూడా ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులను అక్షయ్ ప్రచారం చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో సైబర్ పోలీసుల నిఘాలో అతడు ఉన్నట్లు చెప్పారు. అక్షయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ మోసంలో మరి కొందరి ప్రమేయం ఉన్నదా? ఎంత మొత్తం డబ్బు వసూలు చేశారు? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.