Amit Shah | గువాహటి, జనవరి 20: మయన్మార్‌లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం భారత్‌పై ప్రభావం చూపుతున్నది. ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరామ్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర సీఎం లాల్దుహోమా అభ్యర్థనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారాన్ని నియంత్రిస్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్ సరిహద్దులో కూడా త్వరలో కంచె వేస్తామని ప్రకటించారు.
అస్సాంలోని గువాహటిలో శనివారం జరిగిన అస్సాం పోలీస్ కమాండోస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ సరిహద్దుల మాదిరిగానే మయన్మార్‌తో భారత్ సరిహద్దులను కూడా పరిరక్షిస్తామన్నారు. మయన్మార్‌తో చేసుకొన్న సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారానికి సంబంధించిన ఒప్పందం(ఎఫ్ఎంఆర్)పై పునఃపరిశీలన చేస్తామని, త్వరలో దానికి ముగింపు పలుకుతామని తెలిపారు. ప్రసుత్తం రెండు దేశాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందం మేరకు భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే ఇరుదేశాల ప్రజలు వీసా లేకుండా, ఎలాంటి భద్రతా తనిఖీలు లేకుండా ఒకరి భూభాగాల్లోకి మరొకరు వెళ్లేందుకు అవకాశం ఉన్నది.
మయన్మార్‌లో 2021లో సైన్యం ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలు చేజిక్కించుకొన్నది. అయితే గత కొంత కాలంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులతో కూడిన సాయుధ బృందాలు కూటములుగా సైనిక పాలనను ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మయన్మార్‌లో అంతర్యుద్ధం నెలకొన్నది. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు దాదాపు 600 మంది సైనికులు సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించినట్టు సమాచారం. అంతర్యుద్ధం కారణంగా శరణార్థులు సరిహద్దుల గుండా పెద్దయెత్తున దేశంలోకి ప్రవేశిస్తుండటంపై భారత్ గత నెల తన ఆందోళనను మయన్మార్ పాలకుల దృష్టికి తీసుకెళ్లింది.
మయన్మార్ సరిహద్దులో త్వరలో కంచె వేస్తామని, ఎఫ్ఎంఆర్ ఒప్పందాన్ని రద్దు చేస్తామన్న అమిత్‌షా ప్రకటనపై మిజోరం సీఎం లాల్దుహోమా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కంచె వేయడాన్ని అడ్డుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అయితే దీన్ని వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. మయన్మార్‌లోని చిన్ కమ్యూనిటీ ప్రజలతో మిజోలకు జాతిపరమైన సంబంధాలు ఉన్నాయని, కేంద్రం నిర్ణయాన్ని రెండు వైపులా నివసించే మిజో ప్రజలు ఆమోదించరని అన్నారు.