న్యూఢిల్లీ: ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ చరిత్ర సృష్టించింది. ఏడాదిలో వంద మిలియన్ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ‘ఒక క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అవతరించడం ద్వారా ఇండిగో చరిత్ర సృష్టించింది’ అని పేర్కొంది. దేశంలో ప్రాధ్యాన్యత ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో ఈ విజయం సాధించడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద పది ఎయిర్‌లైన్స్ సరసన చేరినట్లు వెల్లడించింది.
కాగా, ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పీటర్ ఎల్బర్స్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణించిన చారిత్రక మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపారు. మా కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం, ఇండిగో సహచరుల అభిరుచి, కృషి ఫలితంగా ఈ మైలురాయిని సాధించినట్లు పేర్కొన్నారు.