Indigo Flight | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి డిల్లీ వస్తున్న ఇండిగో విమానం(6E 579)లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ ఫెయిల్ అయినట్లు అనుమానం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రన్ వే 28 వద్ద ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ.. పైలట్ చాకచక్యంగా వ్యహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ క్రమంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే 28పై హైవే అలర్ట్ విధించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అన్ని అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఉదయం 10.53 గంటల సమయంలో ఎమర్జెన్సీ సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సహా అన్ని విభాగాలు స్పందించారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రన్‌వే పొడవునా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ప్రొటోకాల్స్‌ను అమలు చేశారు. ఇక విమానాన్ని పైలట్లు జాగ్రత్తగా నియంత్రిస్తూ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సిద్ధం చేశారు.
పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ల్యాండ్ చేయడంతో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దీంతో అందులో ప్రయాణించిన 161 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఇంజిన్‌తో తలెత్తిన సాంకేతిక లోపానికి గల కారణాలపై ఇండిగో యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది.