న్యూఢిల్లీ, డిసెంబర్ 5/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, వాటిని పాటించడంలో ఇండిగో కంపెనీ ఉదాసీనత.. వెరసి దేశీయ విమాన ప్రయాణికులకు గడిచిన నాలుగు రోజులుగా చుక్కలు కనిపిస్తున్నాయి. దేశీయంగా అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసుల్లో శుక్రవారం కూడా తీవ్ర అంతరాయం కనిపించింది. శుక్రవారం ఒక్కరోజే 1,000కిపైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో వరుసగా నాలుగో రోజు దేశవ్యాప్తంగా విమాన ప్రయాణ సంక్షోభం కొనసాగింది. ఢిల్లీతోసహా అన్ని ప్రధాన విమానాశ్రయాలలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాదిమంది ప్రయాణికులు దిక్కుతోచని పరిస్థితులలో చిక్కుకున్నారు. ప్రత్యామ్నాయాలపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. దేశంలో మూడింట రెండు వంతుల విమాన ట్రాఫిక్‌పై ఆధిపత్యం సంపాదించుకున్న ఇండిగో పైలట్లకు సంబంధించిన కొత్త ఫ్లయింగ్ నిబంధనలపై ప్రణాళిక రూపొందించుకోవడంలో విఫలం కావడంతో ప్రధానంగా ఈ సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను నిలుపుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క ప్రయాణికుల ఆందోళనలు, మరోపక్క ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి పెరుగడంతో రంగంలోకి దిగిన డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పైలట్లకు నైట్ డ్యూటీ నిబంధనల నుంచి మినహాయింపునిస్తూ ఇండిగోకు తాత్కాలిక ఊరటను కల్పించింది. డీజీసీఏ ఇదివరకు ప్రకటించిన పైలట్ల కొరత కారణంగా ఇప్పటివరకూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన 235 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. అలాగే ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన అరైవల్స్నూ క్యాన్సల్ చేసింది. అదే విధంగా చెన్నై విమానాశ్రయం నుంచి ప్రధాన మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసింది. ముంబైలో 104 విమానాలు, బెంగళూరులో 102, హైదరాబాద్ విమానాశ్రయంలో 92 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
శుక్రవారం అత్యధికంగా వెయ్యికి పైగా తమ విమాన సర్వీసులు రద్దయినట్లు ఇండిగో ప్రకటించింది. శనివారం కూడా ఇదే స్థాయిలో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. అంతరాయానికి మన్నించవలసిందిగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రాత్రికిరాత్రే సమస్య పరిష్కారం కాదని కూడా పేర్కొంది.

దేశీయ ఎయిర్‌లైనర్ ఇండిగోకు డీజీసీఏ ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వడం పట్ల పైలట్ల సంఘం ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్(అల్పా) శుక్రవారం తీవ్ర అభ్యంతరం తెలిపింది. డీజీసీఏ తాజా నిర్ణయం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని అల్పా విమర్శించింది. ఇండిగో పైలట్లకు కఠినమైన నైట్ డ్యూటీ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తూ డీజీసీఏ జారీచేసిన ఉత్తర్వుల పట్ల అభ్యంతరం తెలియచేసిన అల్పా.. నిబంధనలు రూపొందించడం వెనుక ఉన్న డీజీసీఏ ఉద్దేశాన్నే ఈ ఆదేశాలు దెబ్బతీస్తాయని పేర్కొంది. పైలట్ల ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్ నిబంధనలకు సంబంధించిన రెండవ దశను అమలు చేయడంపై.. పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, తన శీతాకాల విమాన సర్వీసులను ఉద్దేశపూర్వకంగానే పెంచిన ఇండిగో ప్రయాణికుల అసౌకర్యాన్ని సాకుగా చూపి ఇప్పుడు మినహాయింపు కోరుతోందని అల్పా విమర్శించింది.
ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో ఓ ప్రకటన చేశారు. మూడు రోజుల్లోగా ఇండిగో సర్వీసుల పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడచిన నాలుగురోజులుగా వందలాది విమానాల రద్దు, ఆలస్యాలకు దారితీసిన ఇండిగో సంక్షోభానికి కారణాలను నిర్ధారించి జవాబుదారీని కనుగొనేందుకు ఓ ఉన్నత స్థాయి విచారణ కమిటీనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నాయుడు తెలిపారు. డీజీసీఏ ఇదివరకు జారీచేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) ఉత్తర్వులను తక్షణమే నిలిపివేసినట్లు ఆయన ప్రకటించారు.

విమాన సర్వీసులు సాధారణ పరిస్థితికి రావడానికి మరో 10 రోజులు పడుతుందని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే 1,000కిపైగా విమాన సర్వీసులు రద్దయినట్లు తెలిపారు. ఇండిగోకు చెందిన యావత్ నిర్వహణా వ్యవస్థను రిబూటింగ్(పునఃప్రారంభించడం) చేయడం వల్ల పెద్ద ఎత్తున అవాంతరం ఏర్పడిందని వివరించారు. గత కొన్ని రోజులుగా నిర్వహణా అవాంతరాలను ఎదుర్కొంటున్నామని, నేటికి(డిసెంబర్ 5) పరిస్థితి అదుపుతప్పి వెయ్యికిపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పారు. మొత్తం పరిస్థితి సద్దుమణగడానికి 5- 10 రోజులు పడుతుందని, డిసెంబర్ 10, 15 మధ్య క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.