IndiGo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ముగ్గురు నేతలపై బ్యాన్ విధించింది. కేరళ సీఎం పినరయి విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ ఈపీ జయరాజన్, ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. గత నెల 13న కన్నూర్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయన్ తిరువనంతపురం విమానాశ్రయంలో దిగగానే.. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. ఇద్దరు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు.
దీనిపై ఎయిర్‌లైన్ అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి కాగా.. ముగ్గురు నేతలపై రెండువారాల పాటు నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై రెండు వారాల నిషేధం విధించినట్లు సంబంధిత వర్గాలు తెలుపగా.. జయరాజన్‌పై నిషేధం ఎన్నిరోజులు విధించారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. మూడువారాల వరకు నిషేధం అమలులో ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఇండిగో స్పందించలేదు. జయరాజన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ నిషేధానికి సంబంధించి తనకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదన్నారు.