IndiGo flight : ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఒకవైపు కరెంటు కోతలు, ఇంకోవైపు తాగునీటి కష్టాలు. వెరసి దేశ రాజధాని ప్రజలకు తీవ్ర అవస్థలు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International airport) ఇండిగో విమానం (IndiGo flight) ఏకంగా నాలుగు గంటలపాటు ఆగిపోయింది.
విమానం టేకాఫ్ కాకుండా ఆగిపోవడం, లోపల ఏసీ రాకపోవడం, బయట తీవ్రమైన ఎండ వెరసి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక పిల్లలు, వృద్ధులైతే నరకయాతన అనుభవించారు. ఈ బాధలను భరించలేక కొందరు ప్రయాణికులు మొబైల్లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం హై గ్రౌండ్ టెంపరేచర్ కారణంగా 4 గంటలు ఆలస్యమైంది.
విమానం మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి 4.10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం విమానాశ్రయంలోని టార్మాక్‌పై నాలుగు గంటలు నిలిచిపోయింది. లోపలేమో ఏసీ లేదు. దాంతో ఉక్కపోతతో ఊపిరాడక ప్రయాణికులు అల్లాడిపోయారు. ఎట్టకేలకు విమానం సాయంత్రం 6.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యింది. కాగా, బాగ్డోగ్రా విమానాశ్రయం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉంది.
కాగా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.