IndiGo Row | యావత్ దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఐదురోజుల్లో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అవకాశాన్ని ఆసరా చేసుకున్న ఇతర ఎయిర్‌లైన్ కంపెనీలు టికెట్ల ధరలను విపరీతంగా పెంచేశాయి. డొమెస్టిక్ విమాన సర్వీసులకు.. అంతర్జాతీయ విమానాల్లో వసూలు చేసే ధరలను వసూలు చేస్తున్నాయి. దాంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. విమానాల ఛార్జీలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇతర విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 500 కిలోమీటర్ల వరకు రూ.7500 వసూలు చేయాలని చెప్పింది.
1000 కిలోమీటర్లకు రూ.12,000 మాత్రమే తీసుకోవాలని.. 1500 మీటర్ల వరకు రూ.15వేలు, 1500 కిలోమీటర్లకుపైగా రూట్లలో రూ.18వేల వరకు మాత్రమే వసూలు చేయాలని కంపెనీలను ఆదేశించింది. యూడీఎఫ్, పీఎస్ఎఫ్ ఇతర పన్నులను మినహాయించాలని సూచించింది. బిజినెస్ క్లాస్, ఆర్సీఎస్, ఉడాన్ విమానాలకు వర్తించవని చెప్పింది. ఉత్తర్వులను తక్షణం అమలులోకి తేవాలని ఆదేశించింది. జాబితా చేయబడిన రూట్లలో చార్జీలను పర్యవేక్షించడంతో పాటు నియంత్రించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి కూడా సూచించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ధరలు స్థిరీకరించే వరకు, మళ్లీ సమీక్ష నిర్వహించే వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఛార్జీల పరిమితి అన్ని బుకింగ్స్‌కు వర్తిస్తాయని.. ఎయిర్‌లైన్ వెబ్‌సైట్స్, ఆన్లైన్ ట్రావెల్ పోర్టరల్ ద్వారా చేసినా ఇవే చార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. టికెట్ల లభ్యత ఉండేలా చూసుకోవాలని.. అధిక డిమాండ్ ఉంటే విమానాలను పెంచే యోచన చేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. చార్జీల పెంపును నివారించాలని.. సాధ్యమైనంత వరకు రీబుకింగ్ ఆప్షన్స్‌తో సహా ప్రభావితమైన ప్రయాణీలకు గరిష్ట మద్దతును అందించాలని సూచించింది.
ఇండిగో సంక్షోభం కారణంగా విమానాల టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రేట్ల కంటే ఐదు నుంచి పదిరెట్లు పెరిగాయి. పలు మార్గాల్లో రౌండ్ ట్రిప్ ధరలు రూ.80వేల నుంచి రూ.90వేలు దాటాయి. ఢిల్లీ-ముంబయి రిటర్న్ టికెట్ ధర రూ.93వేలకు చేరింది. బెంగళూరు టికెట్ ధర రూ.92వేలు, కోల్‌కతా ధర రూ.94వేలు, చెన్నైకి రూ.80వేలకు పెరిగింది. ఈ రూట్లలో రౌండ్ ట్రిప్ ఎకానమీ ఛార్జీలు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు ఉంటాయి. ఇదిలా ఉండగా.. విమానయాన రంగంలో అధిక టికెట్ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. డొమెస్టిక్ రూట్లలో ఇప్పటికే ఛార్జీలను పరిమితం చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం తెలిపింది. డిసెంబర్ 4 నుంచి అన్ని నాన్-స్టాప్ దేశీయ విమానాలపై ఎకానమీ ఛార్జీలను పరిమితం చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.