Indigo | ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం తొమ్మిదో రోజు వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఇండిగోకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. ఎయిర్‌లైన్స్‌కు చెందిన శీతాకాలం షెడ్యూల్లో ఐదుశాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ ఇండిగో అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. ఎయిర్‌లైన్స్‌పై చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం ఇండిగో రోజుకు సుమారుగా 2,200 విమానాలను నడుపుతున్నది. ప్రస్తుతం విమానాల సంఖ్య 110 వరకు తగ్గనున్నది. విమానాల షెడ్యూల్లో 5శాతం కోత విధించిన విషయాన్ని ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ సమాచారం అందించింది. తగ్గించే విమానాల జాబితాను సైతం సిద్ధం చేస్తున్నారు. నవంబర్ శీతాకాల షెడ్యూల్ ప్రకారం.. వారానికి 15,014 డిపాశ్చర్ విమానాలు.. మొత్తం 64,364 విమానాలకు విమానాయన సంస్థ ఆమోదం పొందినట్లుగా డీజీసీఏ ఇండిగోకు జారీ చేసిన అధికారిక నోటీసుల్లో పేర్కొంది. అయితే, ఆపరేషనల్ డేటా ప్రకారం.. ఇండిగో 59,438 విమానాలను మాత్రమే నడిపించింది. నవంబర్‌లో ఎయిర్‌లైన్స్ 951 విమానాలను రద్దు చేసింది.
నోటీస్ ప్రకారం.. ఈ ఏడాది వేసవికాలం షెడ్యూల్‌తో పోలిస్తే శీతాకాల షెడ్యూల్లో 6శాతం పెంచుకునేందుకు అనుమతి పొందింది. దాంతో 403 విమానాలను ఉపయోగించుకునే వీలు కల్పించింది. ఇండిగో అక్టోబర్ 339 విమానాలను, నవంబర్ 344 విమానాలను మాత్రమే నడపగలిగింది. గతేడాది శీతాకాలం షెడ్యూల్‌తో పోలిస్తే ఎయిర్‌లైన్స్ తన డిపాశ్చర్స్ను 9.66శాతం.. ఈ ఏడాది వేసవి షెడ్యూల్‌తో పోలిస్తే 6.05శాతం పెంచిందని.. కానీ, షెడ్యూల్‌ను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని పేర్కొంది. కంపెనీ షెడ్యూల్‌ను 5శాతం తగ్గించుకోవాలని.. ముఖ్యంగా అధిక డిమాండ్, ఫ్రీక్వెన్సీ ఉన్న విమానాలపై దృష్టి పెట్టాలని సూచించింది. ఏ రూట్లోనైనా ఒక్క విమానానికి సైతం అంతరాయం కలుగకూడదని డీజీసీఏ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.