Delhi High Court | ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, డీజీసీఏ తీరును తప్పుపట్టింది. విమానాల రద్దు, జాప్యాన్ని తీవ్రమైన సంక్షోభంగా పేర్కొన్న కోర్టు.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇండిగో విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు తక్షణ పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వేలాది విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఉపశమనం, రీఫండ్స్ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. విమానాల రద్దుతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా హాని కలిగించాయని కోర్టు పేర్కొంది.
ఇండిగో విమానాలు రద్దయితే.. దీన్ని అవకాశంగా తీసుకొని టికెట్ల ధరలను అడ్డగోలుగా ఇతర ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఎలా పెంచుతాయని నిలదీసింది. ఈ పరిస్థితుల్లో ఇతర విమానయాన సంస్థలు ధరల పెంపును ఎలా సమర్థించుకుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ ధర్మాసనం ప్రశ్నించింది. ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలులో జాప్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా రెండువేలకుపైగా విమానాలు రద్దుకావడంతో 40వేలకు మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారని ధర్మాసనం పేర్కొంది. ప్రయాణికుల భద్రతలో రాజీపడకూడదని.. పైలట్ అలసట ప్రమాదాన్ని పెంచుతుందని, నియంత్రణ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకొని ఉండాల్సిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఇండిగో విమానాల రద్దు తర్వాత ఇతర ఎయిర్‌లైన్ కంపెనీలు చార్జీలను 40వేలకుపైగా పెంచడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది అవకాశవాదం కాదా? అంటూ బెంచ్ నిలదీసింది. గతంలో నాలుగు, ఐదువేలకు లభించే విమాన టికెట్ల ధరలు ఇప్పుడు పెరిగాయని.. ఈ ఛార్జీలు 39వేల వరకు ఎలా పెరుగుతాయని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత డీజీసీఏ మార్గదర్శకాలు, భారత ఎయిర్‌లైన్స్ చట్టం ప్రకారం ప్రభావితమైన ప్రయాణికులందరికీ పూర్తి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విమానాల రద్దుకు సంబంధించి మాత్రమే కాకుండా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణీకుల హక్కుల ముఖ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. డీజీసీఏ తరఫు న్యాయవాదులు ఈ విషయంలో ఇండిగోకు నోటీసులు జారీ చేశారని.. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇండిగో సంస్థ తప్పుకు క్షమాపణలు చెప్పిందని.. పరిస్థితిని సరిదిద్దుతామని హామీ ఇచ్చిందని కేంద్రం పేర్కొంది. ఈ కేసు తుదిపరి విచారణ జనవరి 22న జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ఇండిగో గురించి ఏమీ చెప్పలేమని.. పరిహారం విషయంలో ఆదేశాలు పాటించాలని చెప్పింది. కమిటీ దర్యాప్తు జనవరి 22 నాటికి పూర్తయితే.. నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇండిగో అంశంపై దాదాపు గంటపాటు విచారణ సాగింది. ఇండిగో తరఫున సందీప్ సేథి విచారణకు హాజరయ్యారు. ఫ్లయిట్ రోస్టర్ కారణంగా పరిస్థితి తలెత్తలేదని.. చాలా కారణాలున్నాయని తెలిపారు. పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. అయితే, తమకు వ్యతిరేకంగా తీర్పు ఉండకూడదని చెప్పగా.. ఇండిగో తప్ప మిగతా కంపెనీలన్నీ ఆదేశాలు పాటించాయని కోర్టు గుర్తు చేసింది.
డిసెంబర్ 5న సంక్షోభం సాంకేతిక లోపంతో సహా అనేక కారణాలతో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పగా, ప్రస్తుతం 90శాతం సామర్థ్యంతో విమానాలు నడుస్తున్నాయని సేథీ కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై విచారణ జరుగుతుందని, విమానాల సేవలను తిరిగి ప్రారంభం కావడం సంతోషమేనన్న కోర్టు.. వారం పాటు ఇబ్బందులు పడ్డ ప్రయాణీకుల గురించి ఆలోచించాలని చెప్పింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చెపుతుంది? అంటూ హైకోర్టు సీజే ప్రశ్నించారు. పరిహారం చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని.. తాము ఇంకా ఆదేశాలు గురించి ప్రస్తావించలేదని.. కానీ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఇండిగోను ఆదేశించింది.