న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వైఖరిపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయంపై నిఘా ఊహాగానాలే తప్ప బలమైన ఆధారాలు లేవని కెనడా పార్లమెంటరీ విచారణ కమిషన్ ముందు ట్రూడో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. ‘భారత్‌పై, భారత దౌత్యవేత్తలపై కెనడా చేసిన తీవ్రమైన ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ కెనడా మాకు సమర్పించలేదని మేం చాలా రోజులుగా చెప్తున్నదే ఇవాళ రుజువైంది. భారత్ – కెనడా సంబంధాలు దెబ్బతినడానికి కెనడా ప్రధాని ట్రూడో వైఖరే కారణం’ అని ఆయన పేర్కొన్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను కెనడా అప్పగించలేదు
నిజ్జర్ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర ఉందని ట్రూడో చేసిన ఆరోపణలపై రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, అతడి సంబంధాల గురించి తాము కొన్నేండ్ల క్రితమే కెనడాకు చెప్పామని, వారిని అరెస్టు చేసి, అప్పగించాలని కోరామని తెలిపారు. ఇటీవల కూడా మరోసారి కోరామని, అయినా కెనడా స్పందించలేదని పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలు కెనడియన్ల సమాచారాన్ని సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేశారని ఇటీవల ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే.