న్యూఢిల్లీ, జూలై 16 : భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను రోదసిలోకి ప్రయోగించబోతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ తయారుచేసిన ఈ రాకెట్, మనదేశంలో పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్. దీనికి భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. ఈ రాకెట్ భారత అంతరిక్ష పరిశోధనలో నూతన శకానికి నాందిగా పలువురు పేర్కొంటున్నారు. ‘విక్రమ్-1 నిజమైన రోదసి పరీక్షను చూసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. సంస్థ చేపట్టే మరిన్ని ప్రయోగాలకు ఇది పునాదిగా నిలుస్తుంది’ అని ‘స్కైరూట్’ సీఈవో పవన్‌కుమార్ అన్నారు.
దాదాపు ఏడు అంతస్థుల ఎత్తులో ఉండే విక్రమ్-1 రాకెట్, పూర్తిగా కార్బన్ మిశ్రమ పదార్థంతో నిర్మించారు. ఇది 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి దిగువన ఉండే కక్ష్యలోకి సులభంగా చేర్చగలదు. తొలి ప్రయోగంలో 60 డిగ్రీల వంపుతో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోనున్నది.