(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతీ, యువకులే వారి టార్గెట్. తొలుత జాబ్ ఆఫర్ ఉందంటారు. ‘మంచి కంపెనీలో, ఆకర్షణీయ వేతనంతో మీ కోసం కొలువు వేచి చూస్తున్నద’ని ఊరిస్తారు. ఇది చూసి మాయలో పడ్డామో.. ఇక, అంతే. మన దగ్గర ఉన్న డబ్బంతా ఊడ్చేసి.. పాస్‌పోర్ట్‌ను లాగేసుకొని.. ఓ కట్టు బానిసలా.. ఇరుకిరుకు చీకటి గదుల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ఓ పావుగా వాడుకొంటారు. ఎదురుతిరిగామో.. యువకులనైతే అన్నంపెట్టకుండా చితకబాదుతారు.
అమ్మాయిలైతే, న్యూడ్ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తారు. దేశంకాని దేశం. ఏంచెయ్యాలో కూడా తెలియని దుస్థితి. అలా జీవితం క్రమంగా అంధకారంలోకి దిగజారిపోతుంది. ఇదేదో.. సినిమా స్టోరీ కాదు. భారత్‌కు చెందిన దాదాపు మూడు వేలమందిని ఇలాగే చైనాకు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు చెరబట్టారు. కంబోడియాకు రహస్యమార్గంలో అక్రమంగా తరలించి ఇరుకిరుకు గదుల్లో బంధించారు. ఆ బందీఖానా నుంచి ఎలాగోలా తప్పించుకొన్న మహబూబాబాద్ బయ్యారం మండలానికి చెందిన మున్షీ ప్రకాశ్ తన అనుభవాన్ని జాతీయ పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించాడు. ఆ భయానక అనుభవాలు అతడి మాటల్లోనే..
ట్రావెల్ హిస్టరీ ఉండాలంటే..
బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. అయితే, విదేశాల్లో ఉన్నతోద్యోగం చేయడం నా కల. దీంతో జాబ్ సైట్లలో నా ప్రొఫైల్‌ను అప్లోడ్ చేశా. కొద్దిరోజుల తర్వాత విజయ్ అనే ఏజెంట్ నాకు ఫోన్ చేశాడు. అతనిది కంబోడియాగా చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఓ మంచి కంపెనీలో, ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగావకాశం ఉంది అని ఊరించాడు. ఇంతకు ముందు విదేశాలకు వెళ్లావా? అని నన్ను అడిగాడు. లేదన్నా. దీంతో ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు రావాలంటే అంతకుముందే ఏదైనా దేశానికి ప్రయాణం చేసినట్టు ట్రావెల్ హిస్టరీ ఉండాలన్నాడు. మలేషియాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు చెప్పాడు. దీంతో ఎంతో సంబురంగా విమానం ఎక్కాను.
అక్కడి నుంచి వేధింపులు మొదలు..
కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగగానే అక్కడి నుంచి కొందరు వ్యక్తులు నన్ను కంబోడియా రాజధాని ఫెనోమ్ ఫెన్కు మార్చి 12న తీసుకెళ్లారు. ఏజెంట్ విజయ్ పంపించాడని తనకు తాను పరిచయం చేసుకొన్న ఓ వ్యక్తి నా దగ్గరున్న కొన్ని అమెరికన్ డాలర్లను (విలువ రూ. 85 వేలు) తీసుకొన్నాడు. అతనితో వచ్చిన మరికొందరు చైనీయులు నా దగ్గరున్న పాస్‌పోర్ట్‌ను తీసుకొని కంబోడియాలోనే మరో పట్టణం క్రోంగ్ బావెట్‌కు తీసుకెళ్లారు. పెద్ద భవంతులతో కూడిన మైదానం అది. అందులో ఓ భవంతి (టవర్ సీ)లోకి నన్ను తీసుకెళ్లారు.
యువతీ, యువకులతో కలిపి అక్కడ దాదాపు 3 వేల మంది భారతీయులు ఉన్నారు. అందులో తెలుగువాళ్లే ఎక్కువ. వెళ్లినప్పటి నుంచి దాదాపు పది రోజులపాటు అమ్మాయిల ప్రొఫైల్ ఫొటోలు, పేర్లతో నకిలీ సోషల్‌మీడియా ఖాతాలు ఎలా క్రియేట్ చెయ్యాలి? సైబర్ దాడులు, హనీ ట్రాపింగ్ ఎలా చేయాలి? అన్న విషయాలను నేర్పించారు. స్నానం చేసేప్పుడు అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీసేవారు. తప్పుడు పనులు చేయబోమని ఎదురుతిరిగితే యువకులకు ఆహారం పెట్టకుండా చితకబాదడం చేసేవారు. ఎదురుతిరిగిన అమ్మాయిలను తమ న్యూడ్ వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించేవారు. హనీట్రాపింగ్లో భాగంగా న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ కొందరు యువతులను బలవంతపెట్టేవారు.
అలా బయటపడ్డా..
ముఖ్యంగా తెలుగులో అమ్మాయిల ఫేక్ ఫొటోలతో అకౌంట్లు క్రియేట్ చేయమని నన్ను బలవంతపెట్టేవారు. వ్యతిరేకించిన నన్ను ఓ చీకటి గదిలో వారంపాటు ఉంచి వేధించారు. అస్వస్థతకు గురయ్యా. దీంతో చీకటి రూమ్ నుంచి నన్ను వేరే గదికి మార్చారు. జబ్బుతో ఉన్నప్పటికీ పనిచేయాలని బలవంతపెట్టారు. ఎలాగోలా ఓ మొబైల్ సంపాదించి సెల్ఫీవీడియోలో నా బాధనంతా రికార్డు చేశా. తమిళనాడులోని మా సోదరికి మెయిల్ చేశా. ఆమె అధికారులను సంప్రదించింది. అయితే, ఏప్రిల్ 16న కంబోడియా పోలీసులు ఓ ఆపరేషన్‌లో భాగంగా నన్ను రక్షించారు.
అయితే సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అరెస్ట్ చేశారు. 12 రోజులు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఇండియన్ ఎంబసీ సహకారంతో విడుదలయ్యా. జూలై 5న భారత్‌కు తిరిగొచ్చా. అయితే, కంబోడియాలోని చైనా సైబర్ నేరగాళ్ల డెన్‌లో 3 వేల మంది భారతీయులు ఇంకా బందీలుగానే ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ర్టాలవారే ఎక్కువ. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వారిని రక్షించే చర్యలు చేపట్టాలని ప్రకాశ్ ఈ సందర్భంగా అభ్యర్థించాడు.