Charity | భారతీయులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. 2021-22 సంవత్సరంలో అక్షరాలా రూ.23.7వేలకోట్లు దాతృత్వానికి ఖర్చు చేశారు. ఇందులో అత్యధికంగా ధార్మిక సంస్థలకే విరాళాలు ఇచ్చినట్లు ఓ ప్రైవేట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత ఎక్కువగా యాచుకులకు సాయం అందించినట్లు తేలింది. మానవసేవయే మాధవ సేవగా తలిచే సంస్కృతి మనది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఆపద సమయాల్లో దాతలు చేయూతనందిస్తూ వస్తుంటారు. అధ్యయనం ప్రకారం.. సగటు విరాళాల్లో మొదటి స్థానంలో దక్షిణ భారతం, ఆ తర్వాత స్థానంలో పశ్చిమ భారతం ఉన్నది.
ఇందులో ధార్మిక సంస్థలకు ఇచ్చిన విరాళాల మొత్తం రూ.16.6వేలకోట్లు. విరాళాల మొత్తంలో 70శాతం. ఆ తర్వాత 12శాతం అంటే.. రూ.2.9వేలకోట్లు యాచకులకు సాయం అందించారు. మరో తొమ్మిది శాతం అంటే రూ.2వేలకోట్లు.. కుటుంబీకులు, స్నేహితులు అందజేశారు. 5శాతం అంటే రూ.1.1వేలకోట్లు మతేతర సంస్థలకు, రూ.వెయ్యికోట్లు గృహనిర్మాణ కార్మికులకు ఇచ్చారు. అయితే, విరాళాలు ఇచ్చే కుటుంబాల సంఖ్య పరంగా పట్టణాల కంటే గ్రామీణ భారతమే ముందంజలో ఉండడం విశేషం.
అయితే, విరాళాల్లో రూ.10వేలు, రూ.5వేల నుంచి రూ.10వేలు, రూ.1001 నుంచి రూ.5వేల చొప్పున విరాళాలను ఎక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంట్లో పని చేసే వారికి ఇచ్చినట్లుగా అధ్యయనంలో గుర్తించారు. అత్యల్పంగా రూ.100 కంటే తక్కువగా యాచకులకు ఇచ్చినట్లు తేలింది. అశోక విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అండ్ ఫిలాంత్రోపీ అండ్ కాంటార్లోని వరల్డ్ ప్యానెల్ విభాగం ‘హౌ ఇండియా గివ్స్ 2021-22’ పేరిట అధ్యయనం ప్రచురించింది. ఇందులో 18 రాష్ట్రాల నుంచి 81వేల మందిని సర్వే చేసింది.