పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతున్నది. దేశవ్యాప్తంగా ఆర్మీ అభ్యర్థుల నిరసనలతో హోరెత్తుతున్నది. బీహార్ వ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు బీహార్‌లో 250 మందిని అరెస్టు చేశారు. తాము ఎందుకు నిరసనలు చేస్తున్నామో, ఎందుకు ఇంత కోపంతో ఉన్నామో.. అసలు తమ సమస్య ఏంటో కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని బీహార్‌లోని ఆర్మీ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్ ప్రకటనతో ఆర్మీలో చేరాలన్న తమ కలలు కల్లలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేశంలోని నిరుద్యోగ యువత ఇలా ఎందుకు రోడ్డెక్కిందో కేంద్రం అర్థం చేసుకోవాలి’ అని బీహార్‌లోని పాట్నాలో ఆందోళనల్లో పాల్గొన్న వికాస్ రంజన్ అనే ఆర్మీ అభ్యర్థి పేర్కొన్నాడు. ఆర్మీ బలగాల్లో శాశ్వత ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా తొలగించేందుకు చేస్తున్న కుట్ర అని ఆరోపించాడు. ‘ప్రధాని మోదీ ఎప్పుడూ ఆత్మ నిర్భర భారత్ గురించి మాట్లాడుతుంటారు. అగ్నిపథ్‌తో ఆర్మీ అభ్యర్థులకు ఆత్మ నిర్భరత వస్తుందా?’ అని ప్రశ్నించాడు.
కేంద్రంపై విశ్వాసం పోయింది..
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశంలోని యువతకు విశ్వాసం పోయింది. అగ్నిపథ్ పథకం ప్రకటనతో మా కలలు నాశనం అయ్యాయి. ఎన్నికల్లో ఎన్డీయే గెలవొచ్చు. కానీ యువత నమ్మకాన్ని మాత్రం కోల్పోయింది’ అని వీర్ కున్వర్ సింగ్ వర్సిటీ విద్యార్థి అభిషేక్ సింగ్ చెప్పాడు.
దేశ భద్రత విషయంలో రాజీ
‘అగ్నిపథ్ పథకం బుర్ర పెట్టి ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా లేదు. దేశ రక్షణ కోసం సైన్యాన్ని కాంట్రాక్టు పద్ధతిలో ఎలా తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, రక్షణ విషయంలో రాజీ పడుతున్నదని ఇట్టే అర్థం చేసుకోవచ్చు’అని హర్షిత్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మా కెరీర్ నాశనం చేయొద్దు!: అధికారి భుజాలపై పడి బోరునవిలపించిన ఆర్మీ అభ్యర్థి
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా హర్యానాలోని పానిపట్‌లో ఆందోళనల సందర్భంగా భావోద్వేగ సన్నివేశం కనిపించింది. ఒక అభ్యర్థి.. ఓ అధికారి భుజాలపై పడి బోరున విలపించాడు. సైన్యంలో చేరి దేశం కోసం పనిచేయాలనేది తన కల అని, ఇందుకు నాలుగేండ్లుగా కృషి చేస్తున్నానని చెప్పాడు. అగ్నిపథ్ ద్వారా తన కెరీర్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అగ్నిపథ్‌ను రద్దు చేయండి’ అంటూ అధికారిని కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అధికారి కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ‘బేటా..మీ అభ్యర్థనను లేఖలో రాసి ఇవ్వండి. ప్రభుత్వానికి మెమోరాండం పంపుతాం’ అని సముదాయించాడు.