Indian students : గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల (Indian students) సంఖ్య భారీగా తగ్గింది. ఇండియన్ స్టూడెంట్స్ ప్రధానంగా వెళ్లే కెనడా (Canada), అమెరికా (USA), యూకే (UK) ల్లో వీసా తిరస్కరణలు కూడా అందుకు కారణం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది కెనడా, అమెరికా, యూకేల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాల్లో 25 శాతం తగ్గుదల కనిపించింది.
కెనడాకు వెళ్లేవారి సంఖ్యలో 32 శాతం తగ్గుదల నమోదైంది. ఇది 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు తగ్గింది. ఈ విషయాన్ని కెనడాకు చెందిన ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం పడిపోయింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఎఫ్-1 వీసాల్లో 1,31,000 నుంచి 86,000కు తగ్గుదల నమోదైంది. ఇక యూకేకు వెళ్లే వారి సంఖ్యలో 26 శాతం తగ్గుదల కనిపించింది. గతంలో 1,20,000లుగా ఉన్న విద్యార్థి వీసాలు.. తర్వాత 88,732కు తగ్గాయి.
కెనడా, యూకేల్లో విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు కూడా ఈ పరిస్థితికి కారణమే. కెనడా దేశం భారతీయ విద్యార్థులపై పలు ఆంక్షలు విధించింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ను వేగవంతం చేసింది. తమ దేశంలో తాత్కాలికంగా నివసించే విదేశీయుల సంఖ్యను 2026 నాటికి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటంతో గృహ, ఆరోగ్య, ఇతర ప్రజా సేవలు భారంగా మారాయని సాకు చెబుతోంది. భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32 శాతం తగ్గించింది. అదే సమయంలో చైనీయులకు కేవలం 3 శాతం కుదించింది.
ఇక యూకే కూడా విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపడిన వారిని తమవద్దకు తీసుకురాకుండా నిబంధనలు విధించింది. ఈ కారణంతో అక్కడి వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి కొవిడ్ తర్వాత 2023 నుంచే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం యూకే తగ్గించింది. దాంతో ఆ ఏడాది 13 శాతం తగ్గుదల కనిపించింది. ఇక 2024లో అది 26 శాతానికి పరిమితమైంది.
అయితే గడిచిన పదేళ్లలో కెనడా, అమెరికా, యూకే దేశాల్లో భారతీయ విద్యార్థులు సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది. ఒక దశలో చైనా విద్యార్థులను కూడా భారత విద్యార్థులు దాటేశారు. 2015 నుంచి 2023 మధ్య కెనడా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 31,920 నుంచి 2,78,160కు చేరింది. అదే సమయంలో యూకేకు వెళ్లేవారి సంఖ్య 10,418 నుంచి 1,19,738కి పెరిగింది. అమెరికాకు 2015లో 74,831 మంది ఎఫ్1 వీసాపై వెళ్లగా.. 2023లో అది 1,30,730కి పెరిగింది.