న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తమ కీలకమైన పత్రాలను మరోసారి సమర్పించాలని అధికారులు ఆదేశించడంతో కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. తమ స్టడీ పర్మిట్లు, వీసాలు, మార్కులు, హాజరు సహా విద్యాపరమైన రికార్డులను సమర్పించాలని ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజెఎన్షిప్ కెనడా(ఐఆర్సీసీ) నుంచి అనేక మంది విద్యార్థులకు ఈ-మెయిల్స్ అందాయి. రెండేళ్ల గడువుతో వీసాలు ఉన్న చాలా మంది విద్యార్థులకు ఈ ఈ-మెయిల్స్ గుబులు రేపినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.
అంతర్జాతీయ విద్యార్థుల రాకను క్రమబద్ధం చేసేందుకు ఎస్‌డిఎస్ పేరిట తన ఫాస్ట్ ట్రాక్ స్టడీ వీసా ప్రోగ్రామ్‌ను ఐఆర్సీసీ ముగించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అవసరమైన అర్హతలను కూడా కొద్దిగా కఠినతరం చేయనున్నట్లు కెనడా అప్పటికే ప్రకించింది. గతవారం కూడా ఇటువంటి పరిణామాలు కొన్ని చోటుచేసుకున్నాయి.
పంజాబ్‌కు చెందిన విద్యార్థులకు కూడా ఈ తరహా ఈ-మెయిల్స్ అందాయి. తమ గుర్తింపును నిరూపించుకునేందుకు ఐఆర్సీసీ కార్యాలయాన్ని సందర్శించాలని కూడా వారికి ఆదేశాలు వెళ్లాయి. తాజా పరిణామాల పట్ల భారతీయ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అక్టోబర్ 24న తమ కొత్త ఇమిగ్రేషన్ వ్యూహాన్ని వివరిస్తూ 2025లో కెనడా సుమారు 3.95 లక్షల మందిని పర్మనెంట్ రెసిడెంట్స్‌గా చేర్చుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది 4.85 లక్షల మందిని చేర్చుకుంటారని అంచనా ఉండగా ఆయన లెక్క ప్రకారం 20 శాతం తగ్గే అవకాశం ఉంది.