Double Decker Trains | భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సౌర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. తాజాగా డబుల్ డెక్కర్ రైళ్లలోనే భారీగా మార్పులు తీసుకురాబోతున్నది. త్వరలోనే ఈ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం డబుల్ డెక్కర్ రైళ్లలో కేవలం ప్రయాణికులు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్నది. ఇకపై ప్రయాణికులు వస్తువులతో సహా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నది. ఈ రైళ్లను టూ ఇన్ వన్ రైళ్లుగా పిలుస్తుంటారు. వాస్తవానికి, భారత్‌లో డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నా.. వీటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. వీటిలో ప్రస్తుతం ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. సరుకు రవాణాకు అవకాశం లేదు. అయితే, వీటిని రైల్వే అప్డేట్ చేస్తున్నది. ప్రస్తుతం రెండు రైళ్లను తయారు చేయిస్తున్నది. ఈ రైళ్లలో 20 కోచ్‌లు ఉంటాయి. ఈ కొత్త డబుల్ డెక్కర్ రైల్‌ని కపుర్తలాలోని కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు.
బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్‌తో నడిచే ఈ రైళ్ల కోచ్‌ల ట్రయల్‌ని త్వరలో పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రైలు ఎగువ కోచ్‌లో 46 ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. దిగువ కోచ్ భాగంలో ఆరు టన్నుల వరకు వస్తువులను రవాణా చేసేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే, మూడు రైళ్ల డిజైన్లను రైల్వేబోర్డుకి దృష్టికి తీసుకెళ్లగా.. ఇందులో ఓ డిజైన్ ఆమోదం పొందింది. ఒక్కో కోచ్ తయారీకి రూ.2.70కోట్ల నుంచి రూ.3కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో మొదటి కార్గో లైనర్ రైలుని నిర్మిస్తున్నారు. ఈ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్ ఉంటుందని.. అన్ని రకాల వస్తువులను రవాణా చేసేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేసేలా రైళ్లు ఉండాలని రైల్వే భావించింది. ప్రస్తుతం కాన్సెప్ట్ రైళ్లు అందుబాటులో లేవు. త్వరలోనే ఈ తరహా రైళ్లను భారతీయ రైల్వేశాఖ ప్రవేశపెట్టబోతున్నది.