Rachel Kaur | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: విధి నిర్వహణ కోసం సకాలంలో కార్యాలయాలకు వెళ్లివచ్చేందుకు రోజూ ఎంతో మంది ఉద్యోగులు కార్లు, బస్సులు, రైళ్లు, షేర్డ్ ట్యాక్సీలను ఆశ్రయిస్తుంటారు. కానీ, మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రంలో నివసిస్తున్న భారత సంతతి మహిళ, ఇద్దరు పిల్లల తల్లి రాచెల్ కౌర్ మాత్రం ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు నిత్యం ఏకంగా 700 కిలోమీటర్లకుపైగా దూరం చొప్పున వారానికి 5 రోజులపాటు విమానాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఏషియా’లో ఫైనాన్స్ ఆపరేషన్స్ విభాగ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాచెల్ కౌర్ ‘సీఎన్ఏ’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోజూ ఉదయం 6.30 గంటలకు విమానంలో బయల్దేరి 7.45 గంటలకు కౌలాలంపూర్‌లోని కార్యాలయానికి చేరుకుంటున్నానని, అక్కడ పని పూర్తయ్యాక రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చి పిల్లలను చూసుకోగలుగుతున్నానని వివరించారు. దీనివల్ల ఉద్యోగ-కుటుంబజీవితం సమతూకంగా ఉండటంతోపాటు ప్రతినెలా రూ.14 వేలు ఆదా అవుతున్నాయని చెప్పారు.