హైదరాబాద్: భూమి లాంటి మరో లోకం ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీవానికి మూలమైన కణజాలం ఆ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్(Prof Nikku Madhusudhan) ఆధ్వరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని శోధించారు. మన సౌర కుటుంబానికి ఆవల ఉన్న కే2-18బీ గ్రహంపై.. జీవం ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భూమి మీద చిన్న చిన్న జీవాలు ఉత్పత్తి చేసే కణాలకు చెందిన సిగ్నల్స్ ఆ గ్రహంపై గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తమ స్టడీలో పేర్కొన్నారు. ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్‌లో ఆ పరిశోధన అంశాలను పబ్లిష్ చేశారు.
జీవంతో సంబంధం ఉన్న రసాయనాలను ఆ ప్లానెట్‌పై రెండో సారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ గ్రహంపై ఉన్న వాతావారణంలో ఆ రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఆ రసాయనాలను గుర్తించారు. అయితే ఆ కెమికల్స్‌పై స్టడీ చేసేందుకు మరింత డేటా అవసరం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. త్వరలోనే మరింత ఆసక్తికరమైన సమాచారం వస్తుందని ఆశిస్తున్నట్లు పరిశోధకుడు ప్రొఫెసర్ మధుసూదన్ తెలిపారు. జీవం ఉన్నట్లు చెప్పేందుకు చాలా బలమైన ఆధారం దొరికిందని, అయితే ప్రస్తుతం అందిన సిగ్నల్‌ను ద్రువీకరించేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
కే2-18బీ గ్రహం.. భూమి కన్నా రెండున్నర రెట్ల పెద్ద సైజులో ఉంటుంది. సుమారు 700 ట్రిలియన్ల మైళ్ల దూరంలో ఉంది. అంటే దాదాపు 124 కాంతి సంవత్సరాల దూరం అన్నమాట. ఏ మానవుడు కూడా తన జీవిత కాలంలో అంత దూరం ప్రయాణించలేడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గ్రహం ఓ చిన్నపాటి ఎర్రటి సూర్యుడి చుట్టు చక్కర్లు కొడుతోందని, ఆ సూర్యుడి నుంచి వెళ్లిన కాంతిని స్టడీ చేసి అక్కడి వాతావరణంలో భూమిలాంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
జీవానికి సంబంధమైన డైమిథైల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిథైల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్) అక్కడి వాతావరణంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే భూమ్మీద ఈ వాయువులను సముద్ర మొక్కలు, బ్యాక్టీరియా రిలీజ్ చేస్తాయని పేర్కొన్నారు. కానీ కే2-18బీ గ్రహంపై భారీ స్థాయిలో ఆ వాయువులు ఉన్నాయని, ఇది ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశమని ప్రొఫెసర్ మధుసూదన్ తెలిపారు. భమిమీద ఉన్న వాయువు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదే పరిశోధన బృందంలో భాగస్వామిగా ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ సుబిర్ సర్కార్ కూడా కీలక విషయాన్ని చెప్పారు. కే2-18బీ గ్రహంపై సముద్రం ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోందని, దీంతో అక్కడ జీవం కూడా ఎక్కువే ఉంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడే ఎటువంటి విషయాన్ని నిర్ధారించలేమన్నారు. జీవానికి అనువైన వాయువులు ఆ గ్రహంపై ఉన్నాయంటే, ఆ గ్రహంపై ఆ వాయువులు ఎలా పుడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుందని ఎడిన్బర్గ్ వర్సిటీ ప్రొఫెసర్ క్యాథరిన్ హేమాన్స్ తెలిపారు. డీఎంఎస్, డీఎండీఎస్ వాయువులు.. జీవం లేని వాటి నుంచి కూడా ఉత్పత్తి అవుతాయా లేదా అన్న కోణంలో ఇప్పుడు శాస్త్రవేత్తలు పరీక్షించే పనిలో పడినట్లు తెలుస్తోంది.