Jitendra Singh | 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేవేస్తాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా దేశంగా వేగంగా అడుగులు వేస్తోందని.. అంతరిక్ష రంగంలో ఇది మరో మైలురాయిగా నిలువనుందన్నారు. లోక్సభలో వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై చర్చ జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత తొలి వ్యోమగామి – 2047 నాటికి విక్షిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర’ అనే అంశంపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ అంతరిక్ష యాత్ర ప్రణాళికలో భాగంగా తొలుత 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. ‘వ్యోమ్మిత్ర’ అనే రోబోటిక్ మిషన్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇక 2027లో గగన్యాన్ మిషన్ ద్వారా భారత తొలి మానవ అంతరిక్షయాత్ర నిర్వహించనున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. పూర్తిగా భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ మిషన్ అవుతుందన్నారు. భవిష్యత్తులో భారత్కి సొంత అంతరిక్ష కేంద్రం అవసరం ఉంటుందని కేంద్రం గుర్తించిందని.. 2035 నాటికి ‘భారత్ స్పేస్ స్టేషన్’ నిర్మాణం పూర్తి చేరయనున్నట్లు జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇది పరిశోధనలు, అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువుగా మారనుందన్నారు. 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి సగర్వంగా భారత జెండాను ఎగురవేస్తారన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అంతరిక్ష రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. లోక్సభలో జితేంద్ర సింగ్ మాట్లాడుతుండగా.. బిహార్ ఓటరు జాబితాలో సవరణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాల నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్య ప్రసంగం కొనసాగుతుండగానే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎన్డీఏ నేతలు తీవ్రంగా విమర్శలు చేశారు. ‘దేశం అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదు’ అని రక్షణ మంత్రిరాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మాత్రం వ్యోమగామి శుక్లా ఘనతను ప్రసంశించారు. శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టిన ప్రయోగాలు మానవాళికి ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. అయితే, సభలో ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. సభ్యులు ఎక్కువగా అర్థవంతమైన ప్రశలు అడిగితేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్న ఆయన.. సభను అర్ధాంతరంగా నిలిపివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఉండవంటూ స్పీకర్ ఓం బిర్లా చురకలంటించారు. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల కారణంగా సభ వాయిదా పడడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది.