న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఉత్తర కొరియా-భారత్ దౌత్య సంబంధాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో మూడేండ్ల క్రితం మూసేసిన మన దౌత్య కార్యాలయాన్ని భారత్ తిరిగి పునరుద్ధరించింది. ఎలాంటి హడావిడి లేకుండా, సైలెంట్‌గా దౌత్య కార్యాలయాన్ని భారత్ తెరిచినట్టు ‘ద ట్రిబ్యూన్’ వార్తా కథనం పేర్కొన్నది. కొద్ది రోజుల క్రితమే కొంతమంది దౌత్య అధికారులు, టెక్నికల్ స్టాఫ్ న్యూఢిల్లీ నుంచి ప్యాంగ్యాంగ్కు చేరుకున్నట్టు తెలిపింది. మారిన ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాల్ని మెరుగుపర్చుకునేందుకు భారత్ ఆసక్తి చూపుతున్నది. 2021లో ప్యాంగ్యాంగ్లో దౌత్య కార్యాలయాన్ని భారత్ మూసేసింది. భారత రాయబారి అతుల్ మల్హరీ సహా మొత్తం టీమ్‌ను మాస్కో నుంచి న్యూఢిల్లీకి రప్పించింది. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే, కొవిడ్ కారణంగా మూసేశామని భారత్ చెప్పింది.