కోల్కతా, మే 15 : పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ‘తీస్తా ప్రహార్’ పేరుతో నిర్వహించిన ఈ విన్యాసంలో నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రువు వ్యూహాలను ఎలా భగ్నం చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. సైనికుల సమన్వయం, ఆయుధ సరఫరా తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది.
ఇటీవల భారత సైన్యంలోకి చేరిన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ, ఆయుధాలు ఎలా వినియోగించాలి, తద్వారా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎలా అధిగమించాలో ఇందులో ప్రదర్శించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థంగా, వేగంగా ఎలా ప్రతిస్పందించాలో, లక్ష్యాలను ఛేదించాలో రిహార్సల్స్ చేశారు. దీనికి సంబంధించి భారత ఆర్మీ ఒక వీడియోను విడుదల చేసింది.