లాటర్న్: భారత ఆర్మీ చీఫ్ ఎంఎన్ నరవాణే.. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్నారు. తొలి రోజు లాటర్న్లో జరిగిన కార్యక్రమంలో ఆయన గౌరవవందనం స్వీకరించారు. ఇజ్రాయిల్ దళాల పరేడ్‌ను నరవాణే ప్రశంసించారు. ఆర్మీ చీఫ్ నరవాణే అయిదు రోజుల నిమిత్తం ఇజ్రాయిల్ వెళ్లారు. నవంబర్ 15 నుంచి 19 వరకు ఆయన పర్యటన కొనసాగుతుంది. భారత రక్షణ వ్యవస్థ, భద్రత అంశంలో ఇజ్రాయిల్‌తో బంధాలను బలోపేతం చేయనున్నారు. ఇండో-ఇజ్రాయిల్ బంధాలను పెంచుకునేందుకు ఆయన ఆ దేశ సైనిక, ప్రభుత్వ అధికారులను కలుసుకోనున్నారు.
ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌లు కూడా ఇజ్రాయిల్‌లో పర్యటించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయిల్‌తో సంప్రదింపులు జరిపారు. ఆగస్టు నెలలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా కూడా ఇజ్రాయిల్ వెళ్లారు. తొలి రోజు పర్యటనలో భాగంగా.. ఆర్మీ చీఫ్ నరవాణే.. ఇజ్రాయిల్ రక్షణదళానికి చెందిన గ్రౌండ్ ఫోర్సెస్ చీఫ్ మేజర్ జనరల్ తామిర్ యాదైతో భేటీ అయ్యారు. ఆ ఇద్దరూ ద్వైపాక్షిక సైనిక సహకారం గురించి చర్చించుకున్నారు.