న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఘోర ఓటమిని చవిచూశారు. అమెరికాలోని మూడు ప్రధాన నగరాల్లో అత్యున్నత పదవులకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీకి చెందిన భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు విజయం సాధించారు. న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ, సిన్సినాటి మేయర్‌గా ఆఫ్తాబ్ పురేవాల్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ మూలాలున్న గజాలా ఫిర్దౌస్ హాష్మీ ఎన్నికయ్యారు. అనేక ఎదురుదెబ్బలు తిన్న తరుణంలో డెమోక్రాట్లకు ఈ గెలుపు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మూడు ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగతంగా పోటీ చేయనప్పటికీ ఆయన మద్దతు, పలుకుబడి నేరుగా పనిచేశాయి. న్యూయార్క్ ఎన్నికల్లో న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను ఆయన బాహాటంగా బలపరచడమేగాక మమ్దానీని గెలిపిస్తే న్యూయార్క్‌కు ప్రభుత్వ నిధులను నిలిపివేస్తానని కూడా హెచ్చరించారు. స్వతంత్ర అభ్యర్థిగా క్యూమో ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక వర్జీనియాలో 61 ఏండ్ల హాష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొందారు. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ని ఆమె ఓడించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా, మొదటి ముస్లింగా హాష్మీ చరిత్ర సృష్టించారు. సిన్సినాటి మేయర్ పురేవాల్ రెండో పర్యాయం విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోదరుడు కోరీ బోమ్యాన్ని ఆయన ఓడించారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ మహమూద్ మమ్దానీ దంపతులకు జోహ్రాన్ మమ్దానీ జన్మించారు. మమ్దానీ తండ్రి మూలాలు కూడా గుజరాత్‌కు చెందినవే. ఉగాండాలోని కంపాలాలో జన్మించిన మమ్దానీ 2018లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత అమెరికన్ పౌరుడిగా మారారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో తన బాల్యంలో కొంత భాగాన్ని గడిపిన ఆయన తన 7వ ఏట న్యూయార్క్ నగరంలోకి తన తల్లిదండ్రులతో కలసి వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో సిరియన్-అమెరికన్ ఆర్టిస్టు రమా దువాజీని వివాహం చేసుకున్నారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలుపొందిన తొలి భారతీయ-అమెరికన్, తొలి ముస్లిం మహిళగా గజాలా హాష్మీ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం రిచ్మాండ్ సెనేటర్‌గా ఉన్న హాష్మీ వర్జీనియా రాజకీయాలలో మంచి పేరున్న వ్యక్తి. 2019లో పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆమె రిపబ్లికన్ల అధీనంలో ఉన్న సీటును గెలుపొంది సంచలనం సృష్టించారు. 1964లో హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హాష్మీ పూర్వీకుల మూలాలు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నాయి. హాష్మీకి నాలుగేళ్ల వయసున్నపుడే ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.
భారత సంతతికి చెందిన 43 ఏళ్ల ఆఫ్తాబ్ పురేవాల్ రెండవసారి సిన్సినాటి మేయర్‌గా ఎన్నికయ్యారు. 2021లో సిన్సినాటి నగర మేయర్‌గా గెలుపొందిన తొలి ఆసియన్-అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. పురేవాల్ ఓహియోలో జన్మించారు. పురేవాల్ తండ్రిది భారత్‌లోని పంజాబ్.
హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): అమెరికాలోని వర్జీనియా రాష్ర్టానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి ఇండియన్-అమెరికన్ గజాలా హాష్మీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. మలక్‌పేట్ నుంచి వర్జీనియా వెళ్లి అక్కడి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ లెఫ్టినెంట్ గవర్నర్ స్థాయికి ఎదగడం ఎంతో గొప్ప విషయమని, ఇది మనందరికీ గర్వకారణమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటువంటి వైవిధ్యాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యం గొప్పతనమన్నారు. అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్ మూలాలు గల గజాలా హాష్మీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వర్జీనియా రాష్ర్టానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: న్యూయార్క్, వర్జీనియా, సిన్సినాటి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రిపబ్లికన్ల ఓటమికి ప్రధానంగా రెండు కారణాలను ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో మంగళవారం రాత్రి పంచుకున్నారు. ఒకటి ట్రంప్ పేరు బ్యాలట్ పేపర్లో లేకపోవడం. రెండవది షట్‌డౌన్. ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇవే రెండు కారణాలు అని ట్రంప్ రాసుకున్నారు.
న్యూయార్క్ నగర మేయర్‌గా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మమ్దానీ తన తొలి విజయోత్సవ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ మాటలను ఉటంకించడం, బాలీవుడ్ చిత్రం ధూమ్లోని టైటిల్ ట్రాక్ ధూమ్ మచాలేతో తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. తన ప్రసంగాన్ని వింటున్న ట్రంప్ వాల్యూమ్ పెంచుకోవాలంటూ చమత్కరించారు.