న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21.. 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత రిటైర్ కాబోతున్నది. భారత గగనతలంలో శత్రువుకు సింహస్వప్నంగా నిలిచిన ఈ యుద్ధ విమానం ఇప్పుడు వీడ్కోలుకు సిద్ధమవుతున్నది. 1963లో ఐఏఎఫ్‌లో చేరినప్పటి నుంచి మిగ్-21 భారత్‌కు వెన్నెముకగా నిలిచింది.
1965, 1971లలో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్ సహా అనేక కీలక ఆపరేషన్లలో కీలకమైన పాత్ర పోషించింది. వేగం, చురుకుదనం, పోరాట పటిమతో ఈ విమానం భారత సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాలు సాధించింది. తొలినాళ్లలో ‘ఫ్లయింగ్ డాగర్’గా పేరుపొందిన ఈ విమానం సాంకేతికత పాతదైపోవడం, తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో ‘ఎగిరే శవపేటిక’ అనే అప్రతిష్ఠను మూటగట్టుకుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 19న మిగ్21 వీడ్కోలుకు సిద్ధమవుతున్నది. ఛండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో వైమానికదళ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న మిగ్-21 బైసన్ వేరియంట్ స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ జెట్లు రానున్నాయి. నిజానికి మిగ్ -21 జీవితకాలం ఎప్పుడో ముగిసినా తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిలో జాప్యం కారణంగా దానిని పొడిగించారు.
ప్రస్తుతం ఐఏఎఫ్ రెండు మిగ్-21 బైసన్ స్కాడ్రన్లను (మొత్తం 31 విమానాలు)ను నిర్వహిస్తున్నది. వీటి రిటైర్మెంట్తో ఐఏఎఫ్ పోరాట బలం 29కి తగ్గిపోనుంది. 1963 నుంచి ఇప్పటివరకు సుమారు 400 మిగ్-21 జెట్లు కూలిపోగా, సుమారు 200 మంది పైలట్లు, 40-60 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.