న్యూఢిల్లీ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్న దిరెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)పై ఆంక్షలు విధించాలని ఐక్యరాజ్యసమితిని భారత ప్రభుత్వం కోరబోతున్నది. టీఆర్ఎఫ్ గత నెల 22న పహల్గాంలో ఉగ్ర దాడికి పాల్పడినట్లు రుజువు చేసే సాక్ష్యాధారాలను ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 శాంక్షన్స్ కమిటీకి సమర్పించబోతున్నది. ఈ కమిటీ సమావేశం వచ్చే వారం జరుగుతుంది.
కమ్యూనికేషన్లు, ఆర్థిక సంబంధాలు, ఆపరేషనల్ డీటెయిల్స్ వంటి ఆధారాలను ఈ కమిటీకి సమర్పించబోతున్నట్లు అధికారులు తెలిపారు. అల్‌ఖైదా, ఐసిస్, వాటికి సంబంధించిన ఇతర ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలను ఈ కమిటీ పర్యవేక్షిస్తున్నది. ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై, ఆయుధాల సేకరణపై నిషేధం విధించడం వంటి చర్యలను ఈ కమిటీ ఆదేశిస్తుంది. ఇదిలావుండగా, పహల్గాం ఉగ్రదాడి బాధ్యత తమదేనని టీఆర్ఎఫ్ మొదట్లో ప్రకటించింది, ఆ తర్వాత తోసిపుచ్చింది.