న్యూఢిల్లీ, జనవరి 22 : యూరోపియన్ యూనియన్(ఈయూ)లో భారత్ పెను వాణిజ్య సవాలును ఎదుర్కోనున్నది. భారతీయ ఎగుమతుల్లో అత్యధిక వస్తువులపై ఇస్తున్న జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్పీ) రాయితీలను ఈయూ ఈ ఏడాది జనవరి 1 నుంచి రద్దు చేసింది. దీని ఫలితంగా ఈయూకు ఎగుమతి అయ్యే భారతీయ ఎగుమతుల్లో 87 శాతం అధిక దిగుమతి సుంకాలను చెల్లించాల్సి వస్తుందని గ్రోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బలహీనంగా ఉన్న తరుణంలో దిగుమతి సుంకాల పెంపు భారతీయ ఎగుమతిదారులకు పెను భారం కానున్నది.
జీఎస్పీ అనేది ఏకపక్ష వాణిజ్య పథకం. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణం కంటే తక్కువ సుంకాలతో యూరప్‌నకు వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతిస్తుంది. దీనిని మోస్ట్ ఫేవర్డ్ నేషన్(ఎంఎఫ్ఎన్) సుంకాలు అని కూడా పిలుస్తారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ప్రాధాన్యతా మార్జిన్(ఎంఓపీ)ని పొందుతారు. ఇది ప్రామాణిక ఈయూ సుంకంపై తగ్గింపుగా ఉంటుంది. వస్ర్తాలు, దుస్తులు, పారిశ్రామిక వస్తువులు వంటి అనేక ఉత్పత్తులకు ఈ తగ్గింపు సగటున 20 శాతం వరకు ఉంటుంది. సరళంగా చెప్పాలంటే 12 శాతం ఎంఎఫ్ఎన్ సుంకాన్ని ఎదుర్కొంటున్న దుస్తుల ఎగుమతికి జీఎస్పీ కింద 9.6 శాతం సుంకాన్ని ఇప్పటివరకు ఎగుమతిదారులు చెల్లిస్తున్నారు. కాని జనవరి 1 నుంచి ఈ ప్రయోజనం ముగిసిపోయింది. దీంతో ఎగుమతిదారులు పూర్తి 12 శాతం సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
భారతీయ ఎగుమతుల్లో దాదాపు 87 శాతం వస్తువులు ఇక ఎంఎఫ్ఎన్ సుంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందులో ఖనిజాలు, విలువైన లోహాలు, రసాయనాలు, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, బేస్ మెటల్స్, దుస్తులు, వస్ర్తాలు, యంత్రాలు, నాపరాళ్లు, సెరామిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, రవాణా పరికరాలు వంటివి ఉన్నాయి.
జీఎస్పీ ప్రయోజనాలు ఇప్పుడు కొన్ని చిన్న ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి భారత్ నుంచి ఈయూకి చేసే ఎగుమతుల్లో 13 శాతం లోపే ఉంటాయి. వీటిలో వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు, చర్మ వస్తువులు, కలప, కాగితపు ఉత్పత్తులు, పాదరక్షలు, నేత్ర, వైద్య పరికరాలు, హస్తకళా ఉత్పత్తులు ఉన్నాయి.