న్యూఢిల్లీ: భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. విమానాలు, క్షిపణులు, డ్రోన్లను లేజర్ కిరణాల ద్వారా కూల్చివేసే 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా ప్రదర్శించింది. కర్నూలులో దీనిని పరీక్షించినట్టు డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తెలిపింది. లక్షిత యూఏవీ, డ్రోన్లను లేజర్ డైరెక్టెడ్ వెపన్ (డీఈడబ్ల్యూ) ఎంకే- 2(ఏ)విజయవంతంగా ఛేదించిందని, నిఘా సెన్సార్లను డిజేబుల్ చేసిందని వివరించింది. ఇది ఐదు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా నేలకూలుస్తుంది.
రక్షణ రంగంలో ముఖ్యమైన మైలురాయిగా దీనిని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆయుధంతో అగ్రదేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకు ఈ తరహా అత్యాధునిక ఆయుధాల సామర్థ్యం అమెరికా, చైనా, రష్యా, ఇజ్రాయెల్‌కు మాత్రమే ఉన్నది. కమ్యూనికేషన్ జామింగ్, శాటిలైట్ సిగ్నల్స్ నిలిపివేత సహా పలు ఎలక్ట్రానిక్ యుద్ధ సామర్థ్యాలు దీనిలో ఉన్నాయని డీఆర్డీఓ చైర్మన్ కామత్ తెలిపారు. రోడ్డు, రైలు, గగనం, సముద్రం ఇలా ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించవచ్చునని చెప్పారు. ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైందని వెల్లడించారు. 20 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అత్యంత శక్తివంతమైన సూర్యా లేజర్ ఆయుధాన్ని ప్రస్తుతం డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు.