న్యూఢిల్లీ, నవంబర్ 3 : మోదీ (PM Modi) పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. దేశ ప్రగతికి కొలమానంగా నిలిచే పలు అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకు అంతకంతకూ దిగజారుతున్నది. తాజాగా విడుదలైన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) రూల్ ఆఫ్ లా ఇండెక్స్-2025లో (Rule of Law Index) ఇండియా ర్యాంకు మరింత పతనమైంది. 143 దేశాలకు గానూ గత ఏడాది 79వ స్థానంలో నిలిచిన భారత్.. ఈ ఏడాది ఏడు స్థానాలు దిగజారి 86వ ర్యాంకులో నిలిచింది. ప్రభుత్వ అధికారాలపై నియంత్రణలు, అవినీతి రాహిత్యం, ప్రభుత్వ పారదర్శకత, ప్రాథమిక హక్కులు, శాంతి భద్రతలు, చట్టాల అమలు వంటి అంశాలలో ఆయా దేశాలలో సాధించిన ప్రగతి ప్రాతిపదికన చట్టబద్ధ పాలన సూచీ రూపొందుతుంది.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూల్ ఆఫ్ లా ఇండెక్స్‌లో (Rule of Law Index) భారత్ ర్యాంకు ఏటికేడు దిగజారుతూ వస్తున్నది. 2015లో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 57వ స్థానంలో ఉండగా, 2025కి 86వ ర్యాంకుకు దిగజారింది. ఇక అవినీతిరహిత దేశాల జాబితాలో గత ఏడాది 97వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 99వ స్థానానికి చేరింది.
మోదీ పాలనలో దేశంలో ప్రజల ప్రాథమిక హక్కులు ఏ స్థితిలో ఉన్నాయో రుజువు చేసేందుకు ఈ ర్యాంకే నిదర్శనం. 2015లో భారత్ 62వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 103వ స్థానానికి పడిపోయింది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులోనూ శాంతి భద్రతల విషయంలో గత ఏడాది 98వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ ఏడాది 105వ స్థానానికి పడిపోవడం క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితికి అద్దంపడుతుంది. చట్టాల అమలు యంత్రాంగం పనితీరులో గత ఏడాది 78వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ ఏడాది 79వ స్థానానికి పడిపోయి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసింది.