అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ సర్కార్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. అఫ్గాన్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం 1.6 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను ప్రత్యేక విమానంలో కాబుల్‌కు సరఫరా చేసింది. ఈ సందర్భంగా తాలిబాన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం అత్యావశ్యకమని తాలిబాన్ సర్కార్ పేర్కొంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో భారత్ వీటిని పంపడం ద్వారా కొన్ని కుటుంబాలకు ఆసరా ఇచ్చినట్టేనని భారత్‌లో ఆప్గనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జయి పేర్కొన్నారు. తమకు హాని కలిగించే వారికి కూడా సహాయపడే వారినే మహాత్ములంటారని, విపత్కర పరిస్థితుల్లో ఆఫ్గన్ పిల్లల చికిత్స నిమిత్తమై భారత్ సహాయం చేసిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తాము ధన్యవాదాలు ప్రకటిస్తున్నామని రాయబారి ఫరీద్ మముంద్‌జయ్ ట్వీట్ చేశారు.