న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా తమ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఓ పంచవర్ష ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. ఇదే సందర్భంలో చర్చల ద్వారా ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడిక్కడ ఉభయ దేశాల ప్రతినిధి బృందాలు, వాటికి నాయకత్వం వహించిన మోదీ, పుతిన్ సమక్షంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఉభయ దేశాల నాయకులు విలేకరుల సమావేశంలో సంయుక్తంగా పాల్గొన్నారు. 2023 ఆర్థిక కార్యక్రమాన్ని ఖరారు చేయడంతోపాటు ఆరోగ్య, ప్రజల మధ్య మార్పిడి, రాకపోకలతోసహా వివిధ రంగాలలో సహకార విస్తరణకు సంబంధించి పలు ఒప్పందాలపై ఉభయ దేశాలు సంతకాలు చేశాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి త్వరితంగా శాంతియుత పరిష్కారం లభించాలని తాము కోరుకుంటున్నామని మోదీ చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్, రష్యా కలసి పనిచేస్తాయని ఆయన అన్నారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10,000 కోట్ల డాలర్లకు పెంచాలన్నదే తమ ధ్యేయమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇంధన రంగంలో భారత్‌తో సహకారాన్ని విస్తరించుకోవాలని రష్యా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా లేదని, భారత్ శాంతి పక్షాన ఉందని ప్రధాని మోదీ..పుతిన్‌కు స్పష్టం చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందుకు హాజరైన తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ‘కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం’ అన్న నినాదంతో పుతిన్ తన భారత పర్యటనకు ముగింపు పలికారు.