న్యూఢిల్లీ: గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి. అయితే 2020లో నమోదైన 29,193 హత్య కేసులు, 2021లో నమోదైన 29,272 హత్య కేసుల కంటే 2022లో నమోదైన మర్డర్ కేసులు తక్కువేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు హత్యల రేటు 2.1గా ఉన్నట్లు పేర్కొంది. ఆయా కేసుల్లో ఛార్జ్ షీట్ రేటు 81.5గా ఉన్నదని వెల్లడించింది.
కాగా, ఎన్సీఆర్బీ వార్షిక నేర నివేదిక ప్రకారం 2022లో ‘వివాదాల’ కారణాల వల్ల అత్యధికంగా 9,962 హత్య కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం వల్ల 3,761 హత్య కేసులు, సొంత లాభం కోసం 1,884 హత్యలు జరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
రాష్ట్రాల వారీగా హత్య కేసుల నమోదులో ఉత్తరప్రదేశ్ టాప్‌లో ఉన్నది. 2022లో ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,491 మర్డర్ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834) ఉన్నాయి. మొత్తం హత్య కేసులతో పొలిస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో నమోదైన హత్య కేసుల శాతం 43.92గా ఉంది.
2022లో దేశంలో అత్యంత తక్కువ హత్య కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా సిక్కిం(9) నిలిచింది. నాగాలాండ్ (21), మిజోరం (31), గోవా (44), మణిపూర్ (47) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా పరిశీలిస్తే 2022లో దేశ రాజధాని ఢిల్లీలో 509 హత్య కేసులు నమోదయ్యాయి. జమ్మూ కశ్మీర్ (99), పుదుచ్చేరి (30), చండీగఢ్ (18), దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ (16), అండమాన్, నికోబార్ దీవులు (7), లడఖ్‌లో 5 హత్య కేసులు నమోదు కాగా, లక్షద్వీప్‌లో ఎలాంటి మర్డర్ కేసు నమోదు కాలేదు.
మరోవైపు దేశ వ్యాప్తంగా హత్యల రేటు అత్యధికంగా జార్ఖండ్‌లో (4 శాతం) నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్ (3.6 శాతం), ఛత్తీస్‌గఢ్, హర్యానా ( 3.4 శాతం), అస్సాం, ఒడిశా ( 3 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మొత్తం హతుల్లో 95.4 శాతం మంది పెద్ద వయసువారు. హత్య బాధితుల్లో మహిళలు 8,125 మంది, థర్డ్ జెండర్ వ్యక్తులు 9 మంది కాగా పురుషులు 70 శాతం మంది ఉన్నట్లు ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. ఈ డాటా నేరాల పెరుగుదలను సూచించడంతోపాటు పోలీసుల అసమర్థతను ప్రతిబింబిస్తున్నదని వెల్లడించింది.