Ceasefire | కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందిలా..
మధ్యాహ్నం 3:30 గంటలకు: భారత ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్’ (డీజీఎంవో)కు పాకిస్థాన్ డీజీఎంవో ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు.
సాయంత్రం 4:30 గంటలకు: కాల్పుల విరమణను అమలు చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది.
సాయంత్రం 5 గంటలకు: కాల్పుల విరమణను అమలు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది.
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ప్రతిపాదించగా భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఒప్పందం అనంతరం ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. అనంతరం భూతల, గగనతల, సముద్రతలాల్లో కాల్పుల విరమణకు ఇరు దేశాల మద్య ఒప్పందం కుదిరింది. సాయంత్రం 5 గంటల నుంచే తక్షణం, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది’ అని ప్రకటించారు. ఒప్పందం అమలుపై ఇరువైపులా సైన్యానికి తగిన ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. తదుపరి కార్యాచరణ కోసం రెండు దేశాల డీజీఎంవోలు ఈ నెల 12న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. మరోవైపు సాయంత్రం 4:30 గంటల నుంచి తమ దేశంలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
మోదీ అత్యున్నత సమావేశం
కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ప్రధానికి వివరించారని, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని సమాచారం.
ఆంక్షలు కొనసాగుతాయి..
కాల్పుల విరమణకు మాత్రమే భారత్ అంగీకరించిందని, ఇతర ఆంక్షలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలన్నీ కొనసాగుతాయని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి.
ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుంది
కాల్పుల విరమణపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం కొనసాగుతుందన్నారు. ‘కాల్పుల విరమణ, సైనిక చర్య నిలిపివేతపై భారత్, పాకిస్థాన్ మధ్య ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదం అన్ని రూపాలపై, భావాలపై భారత్ రాజీలేని పోరాటం కొనసాగించింది. ఇకపైనా కొనసాగుతుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అమెరికాకు పాక్ ప్రధాని ధన్యవాదాలు
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ప్రాం తంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసిన ట్రంప్ నాయకత్వానికి ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను నెలకొల్పేందుకే ఈ ఒప్పందానికి అంగీకరించాం. ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారంలో ఈ ఒప్పందం కొత్త ఆరంభాన్ని సూచిస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందిస్తూ.. పాకిస్థాన్ శాంతికాముక దేశమని, తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలుసని తెలిపారు.
కాల్పుల విరమణకు అంగీకరించాం: ఇషాక్ దార్
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ధ్రువీకరించారు. ‘తక్షణం కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. సాయంత్రం 4:30 గంటల నుంచి పాకిస్థాన్ కాల్పుల విరమణ పాటించేలా ఒప్పుకున్నాం. పాకిస్థాన్‌లో శాంతి, రక్షణ, సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడబోము’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాతోపాటు బ్రిటన్, టర్కీ రాయబారులు ఈ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు.
గగనతలాలను తెరిచిన పాక్
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాక్ గగనతలంలో విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (పీపీఏ) ప్రకటించింది.
పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటుచేయాలి
అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించటంపై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజకీయ పార్టీలన్నింటికీ జరిగిన పరిణామలను వివరించాలని, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయాలని కాంగ్రెస్, ఎన్సీసీ(శరద్‌పవార్), ఆర్జేడీ సహా విపక్ష పార్టీలు కేంద్రాన్ని కోరాయి. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను సీపీఐ, సీపీఎం ప్రశ్నించాయి. రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు.
ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవు: భారత ఆర్మీ
పాకిస్థాన్ ఇకపై ఒప్పందాలు ఉల్లంఘించి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని భారత ఆర్మీ ఘాటుగా స్పందించింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన అనంతరం ఆర్మీ స్పందించింది. ‘ఈ రోజు కుదిరిన అవగాహన ఒప్పందానికి మేం కట్టుబడి ఉన్నాం. అయితే భారత సౌర్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా మేం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం’ అని ఆర్మీ కమాండర్ రఘు నాయర్ తెలిపారు. భవిష్యత్తులో పాక్ చేసే ప్రతి ఉల్లంఘనకు అంతకన్నా బలంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.
మా మధ్యవర్తిత్వం ఫలితమే: ట్రంప్
భారత్, పాకిస్థాన్‌తో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని, రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికా మధ్యవర్తిత్వంతో అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల ఫలితంగా భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయిలో, తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఇంగిత జ్ఞానం, గొప్ప తెలివితేటలు ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.
రెండు రోజులపాటు శ్రమించాం: రూబియో
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడానికి తాను, ఉపాధ్యక్షుడు వాన్స్ కలిసి 48 గంటలపాటు శ్రమించామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ ప్రదర్శించిన రాజనీతిజ్ఞతకు, వివేకానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనమని ప్రశంసించారు. ‘నేను, వాన్స్ గత 48 గంటలుగా భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారులు, ఆర్మీ ఉన్నతాధికారులతో తీరిక లేకుండా చర్చలు జరిపాం. ఫలితంగా భారత్, పాక్ కాల్పుల విరమణకు ముందుకొచ్చాయి. తటస్థ వేదికపై చర్చలకు అంగీకరించాయి’ అని అన్నారు.