న్యూఢిల్లీ : వచ్చే ఐదేండ్లలో భారత్‌లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్లు, నర్సులు, కేర్టేకర్లు ఉండరా? అంటే అవుననే అంటున్నారు కెనడాకు చెందిన పరిశోధనా సంస్థ పైన్‌ట్రీ వ్యవస్థాపకుడు రితేశ్ జైన్. భవిష్యత్‌లో సంపన్న దేశాలు తమ వద్ద లేని కార్మికులను దూకుడుగా నియమించుకోవడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ఇంజినీర్ల కొరత ఏర్పడక ముందే ప్లంబర్ల కొరత ఏర్పడనుందన్నారు. ప్రపంచంలో మేధోపరమైన శ్రమ చేసే వైట్ కాలర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు కానీ, శారీరక శ్రమ చేసే బ్లూ కాలర్ కార్మికులకు కొరత ఉందని ఆయన పేర్కొన్నారు.
దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక మార్కెట్లో పెద్దయెత్తున అసమతుల్యతలు ఏర్పడతాయన్నారు. యూరప్, ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధుల జనాభా రోజురోజుకూ పెరిగిపోతున్నదని, జననాల రేటు తగ్గుముఖం పడుతున్నదని, దీని కారణంగా ఆయా దేశాల్లోని సంస్థలు, వ్యవస్థల్లో కార్మికుల అవసరం తీవ్రంగా ఏర్పడుతుందని చెప్పారు. వీటిని భర్తీ చేసుకోవడానికి ఆయా దేశాలు భారత్, పాక్, శ్రీలంక లాంటి దేశాల కార్మికులపై ఆధారపడుతాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో మన దేశం నుంచి బ్లూ కలర్ జాబ్‌లు చేసే చాలామంది విదేశాలకు వలస వెళ్లిపోతారని ఆయన అంచనా వేశారు.