హైదరాబాద్: వారానికి 70 గంటలు, 90 గంటలు పని చేయాలని కొందరు కార్పొరేట్ లీడర్లు సూచిస్తున్న తరుణంలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పటికే ఆ స్థాయిలో పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. పని ఒత్తిడి వల్ల ప్రతి నలుగురు భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకరు తీవ్రమైన బర్న్ అవుట్ ఎపిడమిక్ (నిస్సత్తువ, నీరసం)తో బాధ పడుతున్నట్లు తెలిపింది. బ్లైండ్ అనే గుర్తు తెలియని కమ్యూనిటీ యాప్ భారత్‌లో మార్చి 12 నుంచి 19 వరకు ఈ సర్వేను నిర్వహించింది. 1,450 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం 72 శాతం మంది ప్రొఫెషనల్స్ చట్టబద్ధమైన వారానికి 48 గంటల పని వేళలను మించి పని చేస్తున్నారు. 25 శాతం మంది వారానికి 70 గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం పని చేస్తున్నారు.
ఫలితంగా తమలో శారీరక, మానసిక నిస్సత్తువ ఆవరించిందని 83 శాతం మంది చెప్పారు. ఈ సర్వే ప్రకారం, కొన్ని కంపెనీలు పని గంటలను మితిమీరి పెంచేస్తున్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్ ఎంత ఎక్కువ సమయం పని చేస్తే, అంత ఎక్కువ నిస్సత్తువతో బాధ పడుతున్నారు. తమ శక్తి సన్నగిల్లిందని మొత్తం మీద 83 శాతం మంది చెప్పినప్పటికీ, కొన్ని కంపెనీల్లో ఇది 90 శాతం వరకు ఉంటున్నది. నిర్ణీత పని గంటల కన్నా ఎక్కువ సమయం పని చేసినప్పటికీ, ‘కార్యాలయం పనితో డిస్కనెక్ట్ అయ్యే హక్కు’కు వీరు దూరమవుతున్నారు. కార్యాలయ పని వేళలు ముగిసిన తర్వాత కూడా కార్యాలయ పనికి సంబంధించిన సందేశాలకు స్పందించడం బాధ్యతగా భావిస్తున్నామని 68 శాతం మంది తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇంటి వద్ద నుంచే పని చేయడం అలవాటు అయినప్పటి నుంచి ఈ పరిస్థితులకు బీజాలు పడినట్లు కొందరు ఉద్యోగులు వాపోయారు. ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆన్లైన్లో ఉండాలని కంపెనీలు ఆశించడం అప్పటి నుంచే అలవాటుగా మారింది. ఎక్కువ సమయం పని చేస్తుండటానికి మూల కారణం మితిమీరిన పని చేయాలనే తీవ్రమైన ఒత్తిడి అని ఐటీ ప్రొఫెషనల్స్ చెప్పారు.
వీరు అధిక గంటలు పని చేయాలన్న ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తిని, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంను విమర్శించారు. ప్రామాణిక పని గంటల కన్నా ఎక్కువ సమయం పని చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నామని లేదా తమ సహోద్యోగులు అటువంటి భావనలో ఉన్నారని సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది వెల్లడించారు. దీనివల్ల భారత దేశ ఐటీ రంగంలో మితిమీరిన పని, నిస్సత్తువ ఒకదాని వెంట మరొకటి పునరావృతమవుతున్నాయని కుండ బద్దలు కొట్టారు.
అతిగా పని చేసినంత మాత్రాన మెరుగైన ఫలితాలు వస్తాయనేమీ లేదని చాలా మంది ప్రొఫెషనల్స్ చెప్పారు. కష్టపడి పని చేస్తున్నారనే భావన పైకి కనిపించడం తప్ప ప్రయోజనం ఉండదని తెలిపారు. ఆ స్థాయిలో ఎవరైనా ఆరు నెలల పాటు పని చేస్తే వారి కథ ముగిసిపోతుందని ఓ ఉద్యోగి ఆవేదన చెందారు. అయితే నేటి తరం కంపెనీ లీడర్స్‌లో చాలా మంది వర్క్-లైఫ్ బ్యాలన్స్ గురించి అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.