న్యూఢిల్లీ, మే 25: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. దాదాపు ఐదేండ్ల తర్వాత అఫ్గాన్ పౌరులకు వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించింది. కళాకారులు, బంధువులకు ఇచ్చే ఎంట్రీ వీసాలు, వర్తక, వ్యాపారులు, వైద్య నిపుణులు, ఇతరులు.. ఇలా వివిధ క్యాటగిరీలకు చెందిన అఫ్గాన్లకు భారత్ ఇకపై వీసాలు జారీచేయబోతున్నది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ భారత ప్రభుత్వ అధికారిక పోర్టల్ ‘ఇండియా వీసా ఆన్లైన్’లో విడుదలైంది. ‘న్యూ అఫ్గాన్ వీసా’ మోడల్‌ను గత నెలలోనే ప్రవేశపెట్టినట్టు ఆ నోటిఫికేషన్లో భారత్ పేర్కొన్నది. అఫ్గానిస్థాన్‌ను తాలిబాన్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నాక.. వీసాల జారీని భారత్ నిలిపివేసింది. దీంతో గత కొన్నేండ్లుగా అఫ్గాన్లకు వీసాల జారీ నిలిచిపోయింది.