కోల్‌కతా: భారత్‌లో రాజకీయ విభజన వల్ల పారదర్శకత దెబ్బ తింటున్నదని, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దేశం ‘మిస్టరీ’గా మారిందని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజీత్ బెనర్జీ హెచ్చరించారు. అయితే, దేశ అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. పీటీఐకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక దృక్పథం నుంచి చూసినపుడు దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలక అంశాలు మీడియా స్వేచ్ఛ, పారదర్శకత అని చెప్పారు.
పెట్టుబడిదారులు అంతిమంగా చూసేది డేటా విశ్వసనీయతనే కాని, రాజకీయ వ్యాఖ్యలను కాదని తెలిపారు. ఇండియాలో చాలా కాలం నుంచి చాలా సంఘర్షణలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఇండియా రాజకీయ విభజన(పోలరైజ్డ్) దశలో ఉందని పేర్కొన్నారు. ఓ జాతిగా మనం ఎంత వరకు బహిరంగంగా ఉన్నాం, ఎంత నమ్మదగిన వారంగా పరిగణించబడాలో నిర్ణయించుకోవాలన్నారు. మీడియా స్వేచ్ఛకు సంబంధించినవి వాస్తవ సమస్యలని అభిప్రాయపడ్డారు. గణాంకాలేమిటో మనకు నిజంగా తెలుసా? పెట్టుబడిదారులు చూసేది వాటినే అని చెప్పారు.
ఇండియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కొనసాగిస్తున్నప్పటికీ, అవి అస్థిరమైనవని, అనిశ్చితికి అత్యంత సున్నితంగా వ్యవహరించేవని పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడుల విషయంలో ఇండియా సమంజసంగానే ఉందని, కాని అది చంచలమైనదని తెలిపారు. సొమ్ము తగినంత వేగంతో రావడం లేదు కాబట్టి రూపాయి విలువ పతనమవుతున్నదన్నారు. సుస్థిర మూలధనం రాకపోవడానికి, కరెన్సీ బలహీనతకు ముడిపెట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంచనా వేయడం సాధ్యంకాని విధానాలు, దానికి తోడు అంతర్గత పోలరైజేషన్ కలిసి దీర్ఘకాలిక పెట్టుబడుల గమ్యస్థానంగా దేశ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. విధాన నిబంధనలు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
ప్రత్యేక కంపెనీల పట్ల వైఖరిలో మార్పు ఉంటుందా? అని ప్రశ్నించారు. అంచనా వేయగలిగిన, పారదర్శక విధానాలు, పారదర్శక మీడియా లేని పక్షంలో, ఇండియా ప్రపంచానికి ‘మిస్టరీ(రహస్యం)’గానే మిగిలిపోతుందని చెప్పారు. అన్ని స్థాయిల్లోనూ పారదర్శకత అవసరమని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి గురించి శ్రద్ధ వహిస్తున్నదని, అయితే, దానికి రోడ్‌మ్యాప్ ఏమిటి? అందరికీ అత్యంత నాణ్యమైన విద్య అందడం ఎలా? అత్యధిక ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ) వల్ల పోయినపుడు ఏం జరుగుతుంది? అని బెనర్జీ ప్రశ్నించారు. పతాక శీర్షికల్లో వచ్చే జీడీపీ వృద్ధి రేటు లోతైన సాంఘిక ఒత్తిళ్లను నిరవధికంగా మరుగుపరచలేదని తెలిపారు. జీడీపీ పెరుగవచ్చునని, అత్యధికులకు సరైన విద్య లేకపోతే, వృద్ధి మందగిస్తుందని, కష్టాలు పెరుగుతాయని ఆయన విశ్లేషించారు.
రైతులకు విద్యుత్తు రాయితీలను ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, నేరుగా పరిహారం ఇవ్వడం ఆర్థికంగా ఉత్తమమైనదేనని, భూగర్భ జలాలు అడుగంటుతున్న సమయంలో పర్యావరణపరంగా ఈ చర్య అవసరమని చెప్పారు. నమ్మకం లోపం వల్ల ఇటువంటి సంస్కరణలు రాజకీయంగా ఆచరణ సాధ్యం కానివన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడాన్ని ఉచితాల రాజకీయాలుగా పిలవడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఉచితాల రాజకీయాలనే పదా న్ని తాను అసహ్యించుకుంటానన్నారు. మధ్య తరగతి, సంపన్నులకు వెళ్తున్న పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ను మనం గుర్తించడం లేదన్నారు.
వృద్ధి ఉన్నప్పటికీ తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యే ఆర్థిక వ్యవస్థకు సరైన, హేతుబద్ధమైన స్పందన నగదు బదిలీలేనని స్పష్టం చేశారు. ఇండియన్ ఐటీ కంపెనీలు ఇప్పటికే మధ్య స్థాయి నైపుణ్య ఉద్యోగులను చేర్చుకోవడం లేదన్నారు. పనిలో అత్యధిక వాటాను ఏఐ తీసుకుంటే, ప్రజలు ఆకలితో మిగిలిపోవాలా? అనే అంశాన్ని నిర్ణయించుకోవాలన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ అందరికీ సమానంగా అందడం లేదని, వ్యవస్థ నిర్మాణం పేదలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. మన ప్రతిభావంతుల నుంచి ఫలాలను పొందాలనుకుంటే, నిజమైన అవకాశాల సమానత్వం రావాలన్నారు.