న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: గ్రామీణ భారతంలో పాము కాటు మరణాలను నివారించే లక్ష్యంతో కిసాన్ మిత్ర ఛడీ అనే కొత్త ఎలక్ట్రానిక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. వెలుగు తక్కువగా ఉండే ప్రాంతాల్లో తరుచూ పనిచేసే రైతులు పాముకాటుకు గురికావడం దేశంలో సర్వసాధారణంగా మారిపోయింది. గ్రామీణ భారతంలో ముఖ్యంగా వ్యవసాయ కూలీలు ఎక్కువ పనిచేసే ప్రదేశాల్లో పాముకాటు అనేది ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతున్నది. కాగా తక్కువ ఖర్చుతో లభించే సాంకేతిక పరిష్కారాలు పాము కాటు ముప్పును తగ్గించి వ్యవసాయ పనుల్లో ఆరోగ్య భద్రతను మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి.
దాదాపు 5 నుంచి 15 మీటర్ల దూరంలో దాగి ఉన్న సర్పాన్ని కూడా వైబ్రేషన్ టెక్నాలజీతో పనిచేసే కిసాన్ మిత్ర ఛడీ అనే ఈ పరికరం కనిపెడుతుంది. 100 మీటర్ల దూరంలో ఏదైనా సర్పం ఉంటే వెంటనే గట్టి వైబ్రేషన్ ద్వారా రైతుకు సిగ్నల్ ఇస్తుంది. రాత్రుళ్లు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పాము కాట్లకు గురికాకుండా నివారించడమే ఈ పరికరం ప్రధాన ఉద్దేశం. కిసాన్ మిత్ర ఛడీ అనే ఈ ఎలక్ట్రానిక్ కర్రను భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇది పాము కదలికలపై రైతులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా ఈ పరికరం పనితీరు గురించి వివరించారు. ముందుగా రైతు ఈ కర్రను నేలలో పాతి బటన్ని నొక్కాలి. వెంటనే పరిసరాల్లో (100 మీటర్ల దూరం వరకు) కదలికలను ఈ కర్ర స్కాన్ చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ లేదా నిర్దిష్టమైన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీల ద్వారా పామును గుర్తిస్తుంది. పామును గుర్తించిన తర్వాత కర్ర గట్టిగా వైబ్రేట్ అవుతుంది. దీంతో రైతు పాముబారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ప్రమాదవశాత్తు పాము కాటుకు గురై ఏటా కొన్ని వేల మంది మరణిస్తున్న దృష్ట్యా ఈ మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఈ కర్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పరికరంలో ఉండే సెన్సార్లు పాము కదలికలు, దాని బుసను ఆధారం చేసుకుని రైతులను అప్రమత్తం చేయగలవని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అండ్ ఇంజినీరింగ్ డెవలప్మెంట్ వివరించింది.