NOTAM : పహల్గాం (Pahalgam) ఉగ్రవాద దాడి (Terror attack) తో నెలకొన్న ఉద్రిక్తతల సందర్భంగా పాకిస్థాన్ (Pakistan) విమానాలపై భారత ప్రభుత్వం (Indian Govt) విధించిన గగనతల నిషేధం (Notice To Air Men – NoTAM) ను మరో నెల రోజులపాటు పొడిగించింది. అంటే జూన్ 23 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగకపోవడంతో భారత్ (India) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరగడం, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఆ దాడికి పాల్పడినట్లు తేలడంతో ఏప్రిల్ 23న పాకిస్థాన్ విమానాలపై భారత్ గగనతల నిషేధం విధించింది. అయితే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం గగనతల నిషేధాన్ని ఒకేసారి ఒక నెలకు మించి విధించకూడదు. దాంతో మే 23 తో ఆ నిషేధం ముగిసింది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని మరో నెలరోజులు పొడిగించింది.
ఈ మేరకు భారత విమానయాన శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ రిజస్టర్డ్ విమానాలకు, పాకిస్థాన్ ఎయిర్లైన్స్గానీ, ఆపరేటర్స్గానీ నడుపుతున్న సొంత, లీజుకు తీసుకున్న విమానాలకు ఈ గగనతల నిషేధం వర్తిస్తుందని తెలిపింది. కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అందుకు ప్రతిగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.