న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకొందన్న కెనడా ఆరోపణలు నిరాధారమంటూ కేంద్రం గురువారం వాటిని ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ గురువారం మీడియాకు ఈ విషయాలు తెలియజేశారు.
‘కెనడానే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది. ఈ విషయాన్ని తరచూ మేం వాళ్ల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆయన తెలిపారు. కెనడా వ్యవహారాల్లో విదేశాల జోక్యంపై గతేడాది సెప్టెంబర్‌లో కెనడా ప్రధాని స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం 2019, 2021 ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకొని ఉండొచ్చని తెలిపింది.