India-US : ఇండియా-అమెరికా మధ్య రక్షణ సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఇతర ఆయుధాల్ని భారత్ కొంటూ వస్తోంది. తాజాగా మరో కొత్త రకం ఆయుధాల్ని అమెరికా నుంచి కొనేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి జావెలిన్ అనే యాంటీ-ట్యాంక్ మిస్సైల్స్‌ను కొనేందుకు ఇండియా సిద్ధమవుతున్నట్లు ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ప్రకటన చేశారు. ఇండియా కూడా సొంతంగా క్షిపణులు తయారు చేస్తోంది. అయినప్పటికీ, అమెరికా రూపొందించిన జావెలిన్ భిన్నమైంది. ఇది పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ మిస్సైల్. దీన్ని అమెరికాకు చెందిన లాఖీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. అమెరికాతోపాటు మిత్ర దేశాలు ఇప్పటికే వీటిని భారీ తరహాలో కలిగి ఉన్నాయి. అంతేకాదు.. పలు యుద్ధాల్లో కూడా వినియోగించాయి.
విజయవంతమైన మిస్సైల్స్‌గా వీటికి పేరుంది. ఇది చాలా తేలికైన క్షిపణి. దీన్ని నేరుగా భుజంపై నుంచి ప్రయోగించవచ్చు. ఇది ఆటోమేటిక్ గైడెన్స్ మెకానిజం కలిగి ఉంది. దీన్ని లాంచ్ చేయగానే టార్గెట్‌ను చేధించగలదు. వీటిని ఒకసారి ప్రయోగించిన తర్వాత సైనికులు శతృవులకు చిక్కకుండా మళ్లీ రహస్యంగా రక్షించుకోవచ్చు. దీన్ని బిల్డింగులు, బంకర్ల నుంచి కూడా తేలికగా ప్రయోగించవచ్చు. ఈ జావెలిన్ క్షిపణుల్ని కొనుగోలు చేయడం ద్వారా ఇండియా-అమెరికా మధ్య సైనిక సహకారం మరింత బలపడుతుందని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు.
ఇండియాకు విక్రయించబోయే మిస్సైల్స్ డీల్ 93 మిలియన్ డాలర్లుగా ఉంది. దీని ప్రకారం 100 వరకు జావెలిన్ సిస్టమ్స్, 216 ఎక్స్‌క్యాలిబర్ గైడెడ్ అర్టిల్లరీ ప్రొజెక్టైల్స్‌ను ఇండియాకు విక్రయించనున్నారు.